TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తండ్రి హ‌యాంలో ఆ రాజు..  కొడుకు పాల‌న‌లో ఈ రాజు.. 

Published on: Sat May 15, 2021 12:21PM

రాజులు. వాళ్లు మామూలోళ్లు కాదు. క్ష‌త్రియులు. జ‌స్ట్‌.. పేరులోనే కాదు వాళ్లు చేసే ప్ర‌తీ ప‌నిలోనూ ప్ర‌త్యేక‌త. కింగ్‌లా ఉంటారు. కింగ్‌లానే బ‌తుకుతారు. ఆంధ్రప్రదేశ్  లో అన్ని రంగాల్లోనూ వారి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగునాట ఇద్ద‌రు క్ష‌త్రియ రాజుల‌కు జ‌రిగిన రెండు ఉదంతాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాళ్లిద్ద‌రూ క్ష‌త్రియ రాజులు కావ‌డం.. ఆ రెండు ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు వైఎస్ కుటుంబ‌మే అధికారంలో ఉండ‌టం ఆస‌క్తి క‌లిగించే అంశం. 

న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. అదీ ఆయ‌న బ‌ర్త్‌డే రోజున‌. ఢిల్లీలో, సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ ర‌క్ష‌ణ‌లో ఇన్నాళ్లూ సుర‌క్షితంగా ఉన్న ర‌ఘురామ‌.. పుట్టిన రోజు క‌దాని.. హ‌స్తిన నుంచి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి వ‌చ్చారు. ఇక అంతే. ఎప్ప‌టి నుంచో ఆయ‌న కోసం కాపు కాసి చూస్తున్న‌ట్టు.. ఏపీ పోలీసులు ర‌ఘురామ‌ను క్యాచ్ చేశారు. హైద‌రాబాద్ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు షిఫ్ట్ చేశారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారంటూ పోలీసులు ఏదేదో చెబుతున్నా.. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిత్యం విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే అస‌లు రీజ‌న్ అనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇలా.. ర‌ఘురామ అరెస్ట్‌తో.. రాజు అయిన ఆయ‌న‌.. బంధీగా మారిపోయారు. వేల‌ కోట్ల వ్యాపారాలు, సంప‌ద, మందీమార్బ‌లం ఉన్నా కూడా సామాన్యుడిలా సీఐడీ చెర‌లో మ‌గ్గిపోయారు. 

రాజుల‌కు ఇలాంటి దీన‌స్థితి రావ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ర‌ఘురామ‌కృష్ణ‌రాజును చూస్తుంటే.. మ‌రో రాజు గారు గుర్తొస్తున్నార‌ని అంటున్నారు. ఆయ‌న ఈయ‌న‌కంటే గొప్ప రాజు. ఆయ‌నే  స‌త్యం రామ‌లింగ‌రాజు. ఒక‌ప్ప‌టి స‌త్యం కంప్యూట‌ర్స్ అధినేత‌. 1987 నుంచి 2009 వ‌ర‌కూ ఆయ‌నే సీఈవో. స‌త్యం పేరుతో వంద‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించారు. వేలాది మందికి మంచి భ‌విష్య‌త్తు క‌ల్పించారు. ప్ర‌పంచంలోని అనేక దేశాల కంపెనీల‌కు సాఫ్ట్‌వేర్ సేవలు అందించారు. స‌త్యం కంప్యూట‌ర్స్ అంటే అప్ప‌ట్లో అది జ‌స్ట్ పేరు మాత్ర‌మే కాదు.. ఓ పాపుల‌ర్ బ్రాండ్‌. ఆ కంపెనీ య‌జ‌మానిగా రామ‌లింగ‌రాజు ఐటీ సెక్టార్‌కే ఐకాన్‌గా నిలిచారు. బైర్రాజు ఫౌండేష‌న్‌తో ప్ర‌జాసేవ‌లో ముందున్నారు. క‌ట్ చేస్తే.. ఆయ‌న నిర్మించిన సాఫ్ట్ సౌధం.. ఒక్క రోజులోనే పేక మేడ‌లా కుప్ప‌కూలింది. కార్పొరేట్ ఫ్రాడ్‌కు పాల్ప‌డినందుకు ఆయ‌నపై అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసింది సీబీఐ, ఈడీ. ఏడేళ్ల జైలు శిక్ష కూడా ప‌డింది. అప్ప‌టి వ‌ర‌కూ రాజులా ఉన్న రామ‌లింగ‌రాజు.. ఒక్క అరెస్టుతో అథఃపాతాళానికి ప‌డిపోయారు. చ‌రిత్ర‌లో లేకుండా క‌నుమ‌రుగు అయ్యారు. 

మేటాస్ (SATYAM పేరును తిర‌గేస్తే MAYTAS) అనే రియ‌ల్ ఎస్టేట్, ఇన్ఫ్రా సంస్థ‌ను స్థాపించి.. స‌త్యం కంప్యూట‌ర్స్ నిధుల‌కు అటు దారి మ‌ళ్లించార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. ఆ స‌మ‌యంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. అప్పుడు హైద‌రాబాద్ మెట్రో ప్రాజెక్టును మేటాస్‌కే అప్ప‌గించారు. ఆ డీల్ వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్ జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎలాంటి అనుభ‌వం లేక‌పోయినా.. మేటాస్‌కు మెట్రో ప్రాజెక్టు కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా.. అప్ప‌టి సీఎం వైఎస్సార్ మాత్రం రామ‌లింగ‌రాజు కంపెనీ వైపే మొగ్గు చూపడం వివాదాస్ప‌ద‌మైంది. క‌ట్ చేస్తే.. కొన్నాళ్ల‌కే స‌త్యం కంప్యూట‌ర్స్‌లో రామ‌లింగ‌రాజు ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారంటూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేసి క‌ట‌క‌టాల పాలు చేశాయి. 

తెలుగు వాడు.. క్ష‌త్రియుడైన‌.. రామ‌లింగ‌రాజు ఉన్న‌తి, అధోగ‌తి... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్ప‌ట్లో కొన్ని నెల‌ల పాటు చ‌ర్చ‌నీయాంశం. ఓ వెలుగు వెలిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు అరెస్ట్ వ్య‌వ‌హారం.. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడే జ‌రిగింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైఎస్సార్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో.. మ‌రో రాజు, అనేక కంపెనీల‌కు య‌జ‌మాని అయిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అరెస్ట్ కావ‌డం.. కాక‌తాళీయ‌మే అయినా.. ఆస‌క్తిదాయ‌కం. 

రాజులు సంఖ్యాప‌రంగా త‌క్కువే. వారి మూలాలు భీమ‌వ‌రం చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌కే ప‌రిమితం. ఉన్న‌ది గుప్పెడు జ‌నాభే అయినా.. దాదాపు అంద‌రూ గొప్పోల్లే. ఆస్తులు, వ్యాపారాలు, ప‌లుకుబ‌డి, హోదాల‌కు.. ఆనాటి రాచ‌రిక రాజుల‌కు ఏమాత్రం తీసిపోరు. క్ష‌త్రియులు కావ‌డంతో స్వ‌త‌హాగా పోరాట స్వ‌భావం. అందుకే, ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సైతం అదే పోరాటం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైసీసీ గుర్తుపై గెలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి విధానాలు న‌చ్చ‌క‌.. సొంత పార్టీ ప్ర‌భుత్వాన్ని, పాల‌కులు అవ‌లంభించే త‌ప్పుడు విధానాల‌ను నిత్యం క‌డిగిపారేస్తుంటారు. త‌న‌పై సీబీఐ, ఈడీ కేసులు పెట్టినా ర‌ఘురామ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిపై.. ఏమాత్రం భ‌యం లేకుండా.. ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న‌కు ఎప్ప‌టికైనా ఏపీలో ముప్పు ఉంద‌ని భావించిన ఆయ‌న‌.. కేంద్రానికి ఫిర్యాదు చేసి త‌న ర‌క్ష‌ణ‌కు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని నియ‌మించుకున్నారు. రాష్ట్రంలో ఉంటే ప్ర‌మాద‌మ‌ని.. ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏదో పుట్టిన రోజు క‌దాని.. పొర‌బాటున హైద‌రాబాద్ వ‌స్తే.. ఏపీ పోలీసులు ప‌క్క రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ ఇలా అరెస్ట్ చేస్తార‌ని ఆయ‌న అస్స‌లు ఊహించి ఉండ‌రు. జ‌గ‌న్‌రెడ్డి క‌క్ష క‌డితే ఇలానే ఉంటుంద‌ని అంటున్నారు. 

కార‌ణం ఏదైన‌ప్ప‌టికినీ వైఎస్ కుటుంబం అధికారంలో ఉన్న‌ప్పుడే.. ఇలా ఇద్ద‌రు క్ష‌త్రియ ప్ర‌ముఖులు అరెస్ట్ కావ‌డంతో ఆ రెండు ఘ‌ట‌న‌ల‌ను పోల్చి చూస్తున్నారు. RRR అరెస్టు నేప‌థ్యంలో.. గ‌తంలో జ‌రిగిన స‌త్యం రామ‌లింగ‌రాజు ఎపిసోడ్ మ‌రోసారి గుర్తుకొస్తోంది.