జగన్ గూటిలోకి జలగం
Published on: Sat Mar 17, 2012 3:58PM
సత్తుపల్లి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ త్వరలో వైయస్సార్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడైన జలగం వెంకట్రావ్ 2004లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఖమ్మం జిల్లా డి లిమిటేషన్ లో సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించడంతో ఆయన రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
2009 లో జనరల్ నియోజకవర్గ స్థానాల్లో పోటీచేసేందుకు ప్రయత్నించినప్పటికి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి అడ్డుతగలడంతో ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎన్నికల్లో పోటీచేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకులు లేరు. ఆ పార్టీకి చెందిన కుంజా ధర్మను సస్పెండ్ చేసిన తరువాత జిల్లా పగ్గాలు చేపట్టిన చందా లింగయ్యదొర పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారు. ఈ తరుణంలో జలగం వెంకట్రావు పార్టీలోకి వస్తే పార్టీకి బలం చేకూరుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.


