TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చైనాపై భారత్ నిఘా

Published on: Mon Jan 25, 2016 2:28PM

భారత్ కు ప్రధాన ప్రత్యర్ధి చైనా.పక్కలో బల్లెంలా ఉన్న చైనాపై ఒక కన్ను వేయడం,భారత రక్షణకు మేలు కలిగించేదే..ఆ దిశగానే అడుగు వేసింది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో.చైనాకు పొరుగున ఉన్న దక్షిణ వియత్నాంలో ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్‌, ఇమేజింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది.దీని ద్వారా చైనా భూభాగం, వివాదాస్పద దక్షిణ సముద్రంతో సహా, ఆసియాలోని కీలక ప్రాంతాలన్నీ భారత శాటిలైట్ల పరిధిలోకి వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వియత్నాంతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్‌ తలపెట్టిన ఈ చర్య, చైనాను ఇరకాటంలో పడేసే అవకాశముంది. దీన్ని వ్యవసాయ, శాస్త్ర పరిశోధన, పర్యావరణ అంశాలకోసం చేసే ప్రయోగంగా చెబుతున్నప్పటికీ,మెరుగైన ఇమేజింగ్ పరిజ్ఞానంతో ఇవి తీసే చిత్రాలు సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంటున్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనాతో వివాదం నానాటికీ ముదురుతున్న నేపథ్యంలో వియత్నాం కూడా తన నిఘా, గూఢచర్య, భూపరిశీలన టెక్నాలజీని మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా చూస్తే ఆ దేశానికి ఈ చర్య ఎంతో కీలకమైంది..

ఈ చర్య భారత్-వియత్నం బంధాన్ని, మరింత పటిష్టం చేయడమే కాక,రెండు దేశాల రక్షణ వ్యవస్థలను బలపరిచే ప్రధానాంశంగా కనిపిస్తోంది.భద్రతా లోపాలు పూడ్చుకునే దిశగా వియత్నానికి, తన సామర్థాన్ని విస్తృతం చేసుకోవడానికి భారత్‌కు ఈ చర్య ఉపకరించబోతోందని అంటున్నారు నిపుణులు..దాదాపు 155 కోట్ల వ్యయంతో హో చి మిన్హ్ నగరంలో ఈ శాటిలైట్ సమాచార సేకరణ కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేస్తోంది. ఈ శాటిలైట్ సమాచార కేంద్రం అందించే ఫొటోలను వియత్నాం నిఘా, సైనిక అవసరాలకు కూడా వాడుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు