వచ్చింది.. వెళ్లింది.. ఏం చేసింది..!

ఒక ఏడు, ఎనిమిది నెలల క్రితం తమిళనాడు సీఎం కుర్చీ కోసం రాజీ లేని పోరాటం చేశారు జయలలిత నెచ్చెలి శశికళ. కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జోక్యం, రాజకీయ అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఆ పోరాటంలో చిన్నమ్మ విజయం సాధించలేకపోయారు. దీనికి తోడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా శిక్ష పడటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుకు తెరపడినట్లయ్యింది. అయినప్పటికీ వెనక్కు తగ్గకుండా పన్నీర్ సెల్వానికి అధికారం దక్కకూడదన్న తన మాటను నెగ్గించుకుని విమర్శకుల చేత ఔరా అనిపించుకున్నారు.

 

ఈ నేపథ్యంలో ఆమె జైలుకెళ్లిన కాలంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పళని- పన్నీర్ వర్గాలు కలిసిపోవడం, దినకరన్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం, తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం లాంటివి జరిగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ పెరోల్ మీద బయటకు రావడంతో రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయోనని తమిళ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూశారు.

 

ఆమె వచ్చి రావడంతోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను పరామర్శించారు. అయితే పెరోల్ నిబంధనలు అడ్డువస్తున్నప్పటికీ శశికళతో భేటీ కావడానికి కొంతమంది ప్రయత్నించారు. ముఖ్యంగా చిన్నమ్మ నివాసం, గ్లోబల్ ఆసుపత్రి కేంద్రాలుగా రాజకీయ చర్చలు సాగినట్లు చెన్నై టాక్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై తమ మద్దతుదారులకు శశికళ కొన్ని సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోగా పెరోల్ గడువు ముగిసి.. చిన్నమ్మ జైలులో లోంగిపోయారు. దీంతో ఏదో జరుగుతుందనుకున్న కొంతమందికి నిరాశ ఎదురైంది.