ఒకడే ఒక్కడు మొనగాడు… ఊరే మెచ్చిన పనివాడు!


 

 
బహుశా… దేశంలోనే ఇన్నేసి సార్లు సీఎం సీటులోకి ఎక్కటం, దిగిపోవటం, మళ్లీ ఎక్కటం… ఎవ్వరూ చేసి వుండరనుకుంటా! ఆ రికార్డ్ ను తమిళనాడు మాజీ సీఎం… కాబోయే సీఎం… పన్నీర్ సెల్వం స్వంతం చేసుకుంటున్నాడు! మొదటిసారి జయలలిత జైలుకి వెళ్లినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆమె బయటకి రాగానే అమాంతం అమ్మ పాదాల వద్ద సీఎం పోస్టుని అర్పించేశాడు. మళ్లీ జయ అనారోగ్యంతో సీఎం అయ్యాడు. శశికళ పట్టుదలతో దిగిపోయాడు. కాని, తాజా పరిస్థితులు చూస్తుంటే… తమిళనాడుపై మరోసారి పన్నీరు జల్లు తప్పదనిపిస్తోంది!

 

జయలలిత మరణంతో తమిళనాడులో రణం మొదలైంది. ఒకవైపు చిన్నమ్మ శశికళ, మరోవైపు అమ్మ ఆత్మ శాసించిందంటూ ఎదురుతిరిగిన పన్నీర్ సెల్వం… ఇద్దరి మధ్యా జరిగిన రచ్చలో చివరకు ధర్మమే గెలిచింది. ఏ అర్హతా, విచక్షణా లేకుండా అధికారం కొట్టేద్దామనుకున్న శశికళ, ఆమె బంధువు దినకరన్ ఇద్దరూ అన్నాడీఎంకే నుంచి ఔట్ అయ్యారు. బహుశా పన్నీర్ సెల్వం చెప్పినట్టు జయలలిత ఆత్మవాంఛ కూడా ఇదేనేమో!

 

అన్నాడీఎంకే నుంచీ మన్నార్ గుడి మాఫియా పూర్తిగా గెంటివేయబడటంతో ఇప్పుడు పన్నీర్, పళనిస్వామి వర్గాలు మిగిలాయి. కాకపోతే, వీరిద్దరూ కేంద్రంలోని మోదీ సర్కార్ కనుసన్నల్లో కలిసిపోతారనేది బహిరంగ రహస్యమే. రోజుల వ్యవధిలోనో, కాదంటే గంటల వ్యవధిలోనో పన్నీర్, పళని కలిసి కెమెరాల ముందుకు రావొచ్చు. అయితే, అంతా ఒక్కటై అమ్మ పార్టీని చీలిపోకుండా చూసుకున్నాక.. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీని మీదే అందరి దృష్టి వుంది! కొందరు జయలలిత ఆజ్ఞ ప్రకారం పన్నీర్ సెల్వం మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు. ఇక ఇప్పుడు సీఎంగా వున్న ఈపీఎస్ ఓపీఎస్ కు డిప్యూటీ అవుతాడంటున్నారు. ఒకవేళ పళని స్వామీ ఉప ముఖ్యమంత్రి కాకుంటే కేంద్రంలో మంత్రి అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది!

 

పళని స్వామీ ఢిల్లీకి, పన్నీర్ చెన్నైకి పరిమితం అయితే అన్నాడీఎంకే లుకలుకలు లేకుండా ప్రశాంతంగా వుండే ఛాన్స్ వుంది. అలాగే, బీజేపికి ఎన్డీఏలో బలం చేకూరుతుంది. అంతకంటే ముఖ్యంగా తమిళనాడులో ప్రవేశించాలన్న కమలం కల త్వరలోనే సాకారం అవుతుంది! మొత్తానికి మోదీ, అమిత్ షా, ఓపీఎస్, ఈపీఎస్… అందరికీ విన్ విన్ సిట్యుయేషన్ అన్నమాట!