శశికళ సీఎం అవ్వలేకపోవటానికి ఆ 'ఒక్క రూపాయే' కారణం!

 

ఒక్క రూపాయే కదా అని తేలిగ్గా తీసుకోకండి! ఒక్కో  రూపాయే వందలు, వేలు, లక్షలు, కోట్లు అయ్యేది! అసలు రూపాయి పవర్ ఏంటో జయలలిత, శశికళకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు. పురుచ్ఛితలైవీ అయితే చచ్చిపోయి బతికిపోయింది కాని.... శశికళకు జైలు తప్పలేదు. అదీ నాలుగేళ్లు! మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి దూరం! మొత్తం పదేళ్లు బూడిదలో పోసిన 'పన్నీర్' అయిపోయింది! దీనికంతటికి కారణం ఒక్క రూపాయని మీకు తెలుసా?

 

1991 నుంచీ 1996 దాకా జయలలిత తొలిసారి సీఎం అయ్యారు. అప్పుడు ఆమెను ఎవరూ అడగకున్నా ఓ పొలిటికల్ స్టంట్ చేశారు! అతి నిజాయితీకి పోయి నెలకు కేవలం రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించారు! ఆ నెలకు ఒక్క రూపాయే తరువాతి కాలంలో కొంపలు ముంచింది. ఇంత దాకా తీసుకొచ్చింది. అనవసర పబ్లిసిటీకి పోయి నెలకు రూపాయి అనటంతో.. 5ఏళ్ల పదవి కాలంలో ఆమె ఆదాయం కేవలం అరవై రూపాయలు అవ్వాలి! కాని, అధికారం పోయేనాటికి... అంటే 1991 నుంచి 1996 తరువాత... జయ ఆస్థులు అమాంతం 66కోట్లు పెరిగాయి! ఇదెలా సాధ్యమైంది?

 

నెలకు రూపాయి జీతం తీసుకున్న అమ్మ ఆస్థులు అక్రమంగా పెరిగిపోయాయని సుబ్రమణియన్ స్వామి కోర్టులో కేసు వేశారు! ఇప్పటికి ఇరవై సంవత్సరాల కింద మొదలైన ఆ లీగల్ వ్యవహారం మొత్తానికి ఇవాళ్ల అంతిమ తీర్పు రుచి చూపించింది! శశికళ మరొక్క అడుగు దూరంలో వుండగా ... సీఎం పదవికి ఆమడ దూరంలోకి విసిరేసింది! చెన్నై కోర్టులో మొదలైన సుబ్రమణియన్ స్వామి పోరాటం బెంగుళూరు కోర్టుకు, తరువాత బెంగుళూరులోని కర్ణాటక హైకోర్ట్ కు, చివరకు, సుప్రీమ్ కోర్టుకు చేరింది. స్పెషల్ కోర్టు తప్పంటే హైకోర్ట్ ఒప్పని, హైకోర్ట్ ఒప్పంటే సుప్రీమ్ తప్పని తీర్పులు ఇస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా సినిమా నడిపించాయి. కాని, జయ, శశికళ కీలక పాత్రల్లో కొనసాగిన ఈ మల్టీ స్టారర్ లో అంతిమ విజయం సాదాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వుంటూ వచ్చిన పన్నీర్ సెల్వమ్ ది అయింది! ఇప్పుడాయన తమిళనాడుని ఏలుకునే స్థితిలో కనిపిస్తున్నారు!

 

కర్మ సిద్ధాంతం ఇంత వరకైతే సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు కాని... అప్పుడెప్పుడో జయలలిత ఊరికే జనాకర్షణ కోసం ప్రయోగించిన రూపాయి జీతం అస్త్రం తిరిగి తిరిగి ఆమె మీదకే వచ్చింది. ఆమె ఎలాగో గౌరవంగా తప్పించుకుని వెళ్లిపోయినా... చేసిన అవినీతి కర్మంతా శశికళను మాత్రం వీడటం లేదు!

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu