శశికళ భర్త నటరాజన్ కన్నుమూత...

 

శశికళకు మరో షాక్ తగిలింది. శశికళ భర్త నటరాజన్ గత రాత్రి చెన్నై గ్లోబల్ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నఆయనకు మళ్లీ ఇదే సమస్య తలెత్తడంతో రెండు వారాల నుంచి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 1.35 గంటలకు నటరాజన్ మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా గతంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన నటరాజన్‌.. 1975లో శశికళను వివాహం చేసుకున్నారు. అంతేకాక జయలలితకు కొన్నాళ్ల పాటు రాజకీయ సలహాదారుగానూ ఆయన వ్యవహరించారు.

 

ఇదిలా ఉండగా... తన భర్త మృతికిగాను..తనకు పెరోల్ ఇవ్వాలని శశికళ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి పెరోల్ మంజూరు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె జైలు నుంచి బయటకు వస్తుందని, ఆపై నేరుగా చెన్నై చేరుకుంటారని, రేపు తంజావూరులో జరిగే భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా, ఆమెకు ఎన్ని రోజుల పెరోల్ మంజూరయిందన్న విషయంపై స్పష్టత రాలేదు. న్యాయమూర్తి ఆదేశాలను కాగితాల రూపంలో కోర్టు నుంచి తీసుకెళ్లి జైలు అధికారులకు అందించి, లాంఛనాలు పూర్తి చేసేందుకు మధ్యాహ్నం వరకూ సమయం పట్టవచ్చని శశికళ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగున్నారన్న కేసులో శశికళ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.