కోట్ల కొద్ది బయటపడుతున్న శశికళ ఆస్తులు..

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ ఆస్తులపై, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులపై గత కొద్దికాలంగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు బయటపడగా... ఇంకా కళ్లు చెదిరిపోయే రీతిలో శశికళ, ఆమె కుటుంబసభ్యుల ఆస్తులు బయటపడుతున్నాయి. మొత్తం 187 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించగా.. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ. 4,500 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 80 నకిలీ కంపెనీలను గుర్తించారు. నకిలీ కంపెనీల పేరుతో 1800 ఎకరాల భూమిని వీరు కొనుగోలు చేశారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ. 150 కోట్లతో తమిళనాడులో ఏకంగా 1200 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు నిర్ధారించారు. అంతేకాదు శశికళ, ఆమె కుటుంబ సభ్యులకు చెందిన 200 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. మరోవైపు, పోయెస్ గార్డెన్ లోని హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరింత కీలక సమాచారం ఉండవచ్చని భావిస్తున్నారు.