సర్వే సస్పెన్షన్..ఆశ్చర్యపోయిన హైకమాండ్

 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సర్వే ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీని కలిశారు. అంతరం మీడియాతో మాట్లాడిన సర్వే...ఉత్తమ్ కుమర్ రెడ్డి పార్టీకి శనిలా దాపురించి, నిండా ముంచాడని మండిపడ్డారు. సస్పెన్షన్ వ్యవహారాన్ని ఆంటోనీ దృష్టికి తీసుకెళ్లగా,ఆయన  సస్పెండ్ చేయడం ఏంటని ఆశ్చర్యపోయారని సర్వే వివరించారు. ఏఐసీసీ సభ్యుడునైనా తనపై క్రమశిక్షణా చర్య తీసుకునే అధికారం లేకపోయినా, పీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేశారని అంటోనికి వివరించినట్లు సర్వే చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ కుంతియా చేసిన తప్పిదాలను అంటోనికి వివరించానని ఆయన చెప్పారు. ఉత్తమ్ కుమర్ రెడ్డి చర్యల వల్ల చంద్రబాబు, ప్రొఫెసర్ కోదండరాం, కమ్యూనిస్టు పార్టీలు అంతా అభాసు పాలయ్యారన్నారు. కావాలనే పార్టీకి నష్టం చేసిన పీసీసీ అధ్యక్షుడు పైనే చర్య తీసుకోవాలని కోరినట్లు సర్వే తెలిపారు. తన ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు.