TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ కాంగ్రెస్‌ కు భారీ షాక్

Published on: Fri Nov 20, 2020 7:10PM

తెలంగాణ కాంగ్రెస్‌ కు షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్ళిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ బీజేపీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సర్వే ప్రకటించారు. అంతేకాదు తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే తెలిపారు.

 

సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల వేళ సీనియర్లు పార్టీని వీడడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ని వీడారు. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. మరో నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.