TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మా దేశంలో తాలిబాన్లు హాయిగా ఉన్నారు- పాకిస్తాన్‌

Published on: Thu Mar 3, 2016 3:19PM

 

తమ దేశంలో తాలిబాన్‌ ముఖ్యనేతలంతా హాయిగా తలదాచుకుంటున్నారని, పాకిస్తాన్‌ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్ బయటపడిపోయారు. ఈ విషయం ఇప్పటివరకూ బహిరంగ రహస్యమే అయినప్పటికీ, స్వయంగా ఆ దేశ అధికారే దీన్ని వెల్లడించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. దశాబ్దాల తరబడి ఆఫ్గనిస్తాన్‌లో మారణహోమాన్ని సృష్టించి, లక్షలాది ప్రజల జీవితాలను బలితీసుకున్న తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్‌లో మనుగడ సాగిస్తోందన్న విషయాన్ని సర్తాజ్‌ అజీజ్‌ నిర్మొహమాటంగా అంగీకరించారు.

 

పైగా తమ దేశంలో వారికి కావల్సిన సదుపాయాలన్నీ అమర్చడం వల్లే వారు తమ చెప్పుచేతల్లో ఉంటున్నారనీ, తద్వారా తాము ప్రపంచశాంతికి దోహదపడుతున్నామనీ సర్తాజ్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్‌లో పాగావేసి ప్రపంచాన్ని వణికించిన తాలిబాన్‌, నిదానంగా మళ్లీ పడగ విప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆఫ్గనిస్తాన్లోని భారతీయ దైత్య కార్యలయం మీద తాలిబాన్‌ విధ్వంసానికి తెగబడింది. దీనిబట్టి ప్రపంచశాంతికి పాకిస్తాన్‌ ఏ మేరకు దోహదపడుతోందో అర్థమవుతూనే ఉంది. నిజానికి పాకిస్తాన్‌ తాలిబాన్లని అదుపు చేయడం లేదనీ, తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా తిరిగి వారిని బలపరుస్తోందనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తెలుసుకునేందుకు పెద్దగా పరిశోధన అవసరం లేదుకదా!