వివాహితపై 'ఆశ'పడ్డ 'దోశ'రాజు మృతి

 

హోటల్ శరవణభవన్ అధినేత, దోశ కింగ్ రాజగోపాల్(72) గుండెపోటుతో మృతి చెందారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. వివాహితపై మనసు పడి ఆమె భర్తను హత్య చేయించిన కేసులో జీవితఖైదు పడగా, గతవారంలో శిక్షను అనుభవించేందుకు జైలుకు వెళ్లి, ఆపై గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన దోశ కింగ్.. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చారని, పరిస్థితి విషమించి మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి.

దోశ కింగ్‌గా పేరుగాంచిన రాజగోపాల్ 1981లో చెన్నైలో తొలిసారి హోటల్ శరవణ భవన్‌ను స్థాపించాడు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి విదేశాల్లోనూ తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వివాహితను పెళ్లాడితే తన ప్రభ మరింత వెలిగిపోతుందన్న ఓ జ్యోతిష్యుడి సలహాతో.. అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజగోపాల్.. ఆ వివాహిత వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. రాజగోపాల్ ప్రతిపాదనను ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకుని ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో వివాహిత భర్తను కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌ను దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు జీవిత శిక్ష విధించింది.