శరత్ పవార్ హస్త సాముద్రికం

 

రెండు నెలలుగా ఉవ్వెత్తున ఎగిసిపడిన సీమాంధ్రలోని సమైక్యాంధ్ర ఉద్యమాలు, కారణాలేవయితేనేమి ఒక్కసారిగా చల్లబడ్డాయి. ప్రభుత్వోద్యోగులు కూడా సమ్మె విరమించు కోవడంతో సీమాంద్రాలో మళ్ళీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. ఇంత కాలం ఇంటి మొహం చూడలేక హైదరాబాద్, డిల్లీలలో తలదాచుకొని తిరుగుతున్న యంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా మెల్లగా గూటికి చేరుకొంటున్నారు. ఇక యంపీలు, మంత్రుల రాజినామాలేవీ కూడా ఇంతవరకు ఆమోదం పొందలేదు గనుక, వారు తమ పదవులలో కొనసాగవచ్చును. ఇక రాజీనామాలు చేయమని భీష్మించుకొని కూర్చొన్నమంత్రులు, కష్టకాలంలో అధిష్టానానికి బాసటగా నిలిచినందుకు గాను వీర త్రాళ్ళు వేయించుకొని, మరింత నిబద్దతతో అధిష్టాన సేవ వీలు చిక్కితే ప్రజాసేవ కూడా చేసుకోవచ్చును.

 

అయితే వయసు మీద పడుతున్నకేంద్రమంత్రి శరత్ పవార్ మాత్రం ఇవేమీ చూడకుండా కేవలం కాంగ్రెస్ హస్త రేఖలు చూసి త్వరలో సీమాంద్రా యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తే, తమ యూపీయే ప్రభుత్వం పడిపోవచ్చునని, అందువల్ల మధ్యంతర ఎన్నికలు ఎప్పుడయినా రావచ్చునని జోస్యం చెప్పేసి రాజకీయ విశ్లేషకులకి, మీడియాకు అందరికీ మళ్ళీ పని కల్పించారు.

 

ఆయన జోస్యం వమ్ము కాకూడదంటే శాసన సభకు టీ-బిల్లు రావాలి. దానికి వ్యతిరేఖంగా సీమాంధ్ర శాసనసభ్యులందరూ పార్టీలకతీతంగా ఓటేసి, ఓడించాలి. అప్పుడు ముందే అనుకొన్నట్లు ముఖ్యమంత్రితో సహా అందరూ రాజీనామాలు చేయాలి. రెండు సమావేశాలతోనే రెండు నెలల ఉద్యోగుల సమ్మెను చల్లార్చగలిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే ఉద్యోగుల సమ్మెలు, ప్రజా ఉద్యమాలు మొదలవ్వాలి. ఆ ఒత్తిడితో మిగిలిన యంపీలు, కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలు చేయాలి. అప్పుడే శరత్ పవార్ జోస్యం నిజమవుతుంది.

 

అయితే కేంద్ర హోం మంత్రి షిండే శాసనసభకు టీ-బిల్ వెళ్ళదు, దాని ఆమోదం కూడా మాకవసరం లేదు. ఏదో సంప్రదాయాన్ని కాదనలేక శాసనసభ్యుల ముచ్చట కోసం కేవలం ఓ డ్రాఫ్ట్ కాయితం మాత్రం పంపుతాము. దానిని వారు చింపి చెత్త బుట్టలో పడేసినా, దానితో తెలంగాణా ప్రక్రియ ఆగిపోదని ఇటీవలే శలవిచ్చారు. అంటే ఇంత కాలం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీ-బిల్లుపై చెపుతున్నవన్నీ పిట్ట కధలేనని అర్ధం అవుతోంది.

 

అందువల్ల ఆయనతో సహా ఆయన సీమాంధ్ర మత్రులందరూ రాజీనామాలు చేసి తప్పుకొన్నా, ప్రజలు కూడా వారిని నమ్మే పరిస్థితుల్లో లేరు గనుక, వారందరూ కూడా మరో కొత్త సాకుతో మరో కొత్త ‘డెడ్ లైన్’ సెట్ చేసుకొని తమ పదవులలో కంటిన్యూ అయిపోవచ్చును. ఇక రెండు నెలలు నిష్పలమయిన ఉద్యమాలు చేసి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు కూడా మళ్ళీ ఇంత త్వరగా సమ్మె చేస్తారని భావించలేము.

 

అటువంటప్పుడు మిగిలిన యంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తారనుకోవడం కంటే, రాజీనామాలు చేసిన వారు కూడా తమ రాజీనామా పత్రాలను వెనక్కు తీసేసుకొని, ఈ ఆరు నెలల పుణ్యకాలంలో పరిస్థితులు మళ్ళీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వీలయినంత ఎక్కువ ప్రజాసేవ చేసేయవచ్చును. గనుక శరత్ పవార్ తన మెదడు మీద ఒత్తిడి తెచ్చుకొని ఇటువంటి జోస్యాలు చెప్పడం కంటే ఒక చిలుకను తెచ్చుకొంటే మంచిదేమో!