జన్మదిన ‘జగన్గురువు’కు జయహో!

దండోరాతో ధన్యమవుతున్న దేవదాయశాఖ

 

అంకుల్ రేపు నా హ్యాపీబర్త్‌డే.. చిన్నారి ‘బ్యాడ్మింటన్ ప్రభాకర్’ మురిసిపోతూ ఇచ్చిన హింట్ అది.  ఓహో.. అంటే రేపు తనకు బర్త్‌డే గ్రీటింగ్‌తో పాటు, గిఫ్టు కూడా తీసుకురావాలన్న మాట. జగన్నాధరెడ్డి అంకుల్ మట్టిబుర్రకు, చాలాసేపటి తర్వాత గానీ చిన్నారి విశ్వనాధ్ ‘కవిహృదయం’ అర్ధం కాలేదు. సహజంగా చిన్నపిల్లలు తమ హ్యాపీబర్త్‌డేకి రమ్మని, ఎవరినీ పిలవరు. ఫలానా రోజున తమ హ్యాపీబర్త్‌డే అని మాత్రమే చెబుతారు. అంటే ఆరోజున మనమే ఆ చిరంజీవులకు.. చాక్లెట్లో, బిస్కెట్లో గిఫ్టుగా ఇవ్వాలన్నమాట. ఇది సహజంగా అందరికీ తెలిసిన ఛైల్డ్ సైకాలజీ.

 

కానీ ఇప్పుడు ‘ఓల్డేజీ సైకాలజీ’ కూడా ఒకటి పుట్టుకొచ్చింది. ఫలానా రోజు పెద్దాయన పుట్టినరోజు కాబట్టి, మీరంతా వచ్చి ఆయనను ఆశీర్వదించి వెళ్లాలనే న్యూట్రెండన్నమాట! అది కూడా ఆ పెద్దాయన మఠం వేసుకున్న, పీఠం నుంచే అందిన వినతిలాంటి ఆదేశం. అంటే బలవంతపు బ్రాహ్మణార్ధమన్న మాట. మరి ‘చిన్నారి బ్యాడ్మింటన్ ప్రభాకర్’ హ్యాపీబర్త్‌డేకు, ‘పెద్దయిన’ పీఠాథిపతికి ఏం తేడా ఉంది చెప్పండి? షేమ్ టు షేమ్ కదా? కావాలంటే మన జగన్గురువు, జగద్రక్షకుడు, సృష్టి-స్థితి-లయకారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడయిన విశాఖ పీఠాథిపతి శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ స్వరూపానంద మహాస్వామి జన్మదిన ముచ్చటను మీరే చూడండి.

 

విశాఖ పీఠాథిపతి స్వరూపానందుల వారికి.. దేవుడు కొలువుదీరిన దేవాలయాలు, అందులోని ప్రధానార్చకుల జీవితాలను ధన్యం చేయాలన్న ముచ్చట ఎప్పటినుంచో ఉంది. కానీ అందుకు సమయం-సందర్భం కలసిరావడం లేదు. అంతలోనే పీఠం మేనేజరు గారికి దివ్యమైన ఆలోచన వచ్చింది. స్వామి వారి జన్మదినం ఎలాగూ ఈనెల 18న వస్తోంది కాబట్టి.. రాష్ట్రంలోని పెద్ద ఆలయాల ప్రధాన షర్చకులను ఆయన సముఖానికి పిలిపించుకుని, వారితో ఆశీర్వాదం ఇప్పించుకుంటే.. పుణ్యం-పురుషార్ధం రెండూ కలసి వస్తాయని తలచారు. ఆ రకంగా అర్చకుల జీవితాలు, వారు సేవ చేసే దేవదేవతల జీవితాలు కూడా జాయింటుగా ధన్యమవుతాయని భావించారు.

 

వెంటనే తమ సంకల్పాన్ని,  దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రూపంలో వెల్లడించారు. దాన్ని అందుకున్న సదరు కమిషనరు.. ఆ లేఖ స్వయంగా పరమాత్ముడే, కంప్యూటరు అక్షరాలతో రాసినట్లు ఫీలయ్యారు. తన మీద స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈరూపంలో ప్రసరిస్తాయనుకోలేదని, ఆనందభాష్పాలతో ఆయన కళ్లు జలధార కార్చాయి. వెంటనే కర్తవ్యం గుర్తొచ్చి.. లోకరక్షకుడయిన విశాఖ స్వామి వారి జన్మదినం... ఈనెల 18న ఉంది కాబట్టి, మీరంతా మీ ప్రధానార్చకులను విశాఖ చినముషిడివాడలో, మనిషిరూపంలో కొలువైన స్వరూపానందుల వారి వద్దకు పంపి, వారికి ఆశీర్వాచనాలు ఇవ్వాలని 23 దేవాలయాలకు హుకుం జారీ చేశారు. మంచిదే.  జగన్గురు, జగద్గురువైన శ్రీమాన్ స్వరూపానందుల వారి జన్మదినమంటే అది లోకకల్యాణం కోసమే క దా? మరి ఆయన ఈ గడ్డపై పుట్టిందే, లోకకల్యాణార్ధం కోసమాయె!

 

అది ఓకే. కానీ జీవితం బుద్బుదప్రాయమని ప్రవచించే.. సర్వసంగ పరిత్యాగులు- సన్యాసులకు జన్మదిన వేడుకలేమిటి? సన్యాసి అంటే స్వయంగా నారాయణ స్వరూపుడు. సన్యాసులు ఆశీర్వదించాలే తప్ప, ఆశీస్సులు తీసుకోవడమేమిటి? నారాయణ స్వరూపులు ఎదురయితే.. అంతటి  యమధర్మరాజు కూడా పక్కకు తొలగి, దారి ఇస్తారు కదా? అయినా విశాఖ స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులే తరలివచ్చి,  ఆశీర్వదించడమేమిటి విచిత్రం కాకపోతే?! అసలు ప్రధానార్చకులు, ఆలయంలోని మూలవిరాట్టును వదలి, బయటకు రాకూడదు. మరి  విశాఖ వేలుపు వద్దకు వెళ్లడమంటే.. స్వయంగా ఆ దేవదేవతలే విశాఖ స్వామి వద్దకు వెళ్లినట్టు కాదా? ప్రధాన అర్చకుండంటే ఆయన కూడా, మూలవిరాట్టుతో సమానం కదా? మరి ఈ ఆధ్మాత్మిక అపచారం- అరాచకాన్ని స్వయంగా, దేవదాయ శాఖనే ప్రోత్సహించి, ధర్మానికి పాతర వేస్తే ఎలా? అయినా.. సర్వసంగ పరిత్యాగులయిన సన్యాసికి ఈ సన్నాసి పనులేమిటి?

 

ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసి, మతిలేని మాటలు మాట్లాడితే.. కళ్లు దీపావళి బాంబుల్లా పేలిపోతాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల స్వామికి.. చంద్రుడికో నూలుపోగులా జన్మదిన వేడుకలు జరిపితే తప్పేమిటి? మామూలుగా అయితే పీఠాథిపతుల జన్మదినం రోజున ఆయన నక్షత్రం ప్రకారం.. పీఠపాలిత దేవాలయాల్లో మాత్రమే అర్చనలు చేయడం ఒక ఆచారం. కానీ అదంతా పబ్లిసిటీ పిచ్చలేని సాధారణ స్వాముల విషయంలో!

కానీ, మన విశాఖ స్వరూపులను..  అలా ఇతర పీఠాథిపతులతో పోల్చి అవమానిస్తే ఎలా? కంచి-శృంగేరి అంటే పురాతన పీఠాలు. విశాఖ పీఠమంటే స్వయంప్రకటితం. ముద్దులకు కేరాఫ్ అడ్రెసు. మరి స్వయంకృషితో ఒక స్వయంప్రకటిత పీఠాథిపతి, ఈ స్ధాయికి చేరినందుకు గర్వించాలే తప్ప..  ఈ చచ్చు పుచ్చు ఇచ్చకాలతో,  ఆయన ఇమేజీని డ్యామేజీ చేయడం తప్పు కదూ?

 

సరే.. దేవదాయ శాఖ ఉన్నతాధికారంటే, ఏదో ఓవరాక్షన్‌తో.. సర్కారుకూ తెలియకుండానే, ‘సన్యాసికి జన్మదినం’ పేరిట.. ఇలాంటి అడ్డగోలు ఉత్తర్వులిచ్చి, శాస్త్రాలను  అవమానించారనుకుందాం. ఇప్పటికే దీనిపై సోషల్‌మీడియాలో ‘స్వరూపానందరెడ్డి’ అంటూ ఎకసెక్కాలు మొదలయ్యాయి. అది వేరే విషయం.  మరి ధర్మశాస్త్రాలు పుక్కినపట్టిన,  పీఠపాలకుల బుద్ధి-బుర్ర ఏమయింది? అలా నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా.. నిర్భయంగా.. సన్యాసయిన మా  స్వామివారికి జన్మదిన వేడుకలు జరపమని, ఏ మొహంతో అభ్యర్ధించారు?

 

అసలు సన్యాసికి జన్మదినం ఏమిటని నలుగురూ నాలుగురకాలుగా మాట్లాడితే, మొహం ఏ రిషీకేషులో పెట్టుకుంటారు? అయినా.. ఈ వయసులో ఆ పబ్లిసిటీ పిచ్చేమిటి.. కలికాలం కాకపోతే? అలా పుట్టినరోజు చేసుకునే సన్యాసులను, సన్నాసులని ఎవరైనా తిట్టిపోస్తే ఆ నామర్దా ఎవరికి? అందరినీ వచ్చి ఆశీర్వదించమనే  ఆ బలవంతపు బ్రాహ్మణార్ధమేమిటి? పీఠాథిపతులకు ఇంతకంటే పరువుతక్కువ ఇంకేమైనా ఉందా?... ఇవే కదా.. మెడపై తల ఉన్న వారు సంధించే ప్రశ్నలు?!

 

ఏం చేస్తాం.. ‘అతి’యే మన గతి అనుకోవాలి. లేకపోతే వృద్ధాప్యంలో వేసే పిల్లచేష్టలయినా అనుకోవాలి! ఏదేమైనా సృష్టి స్థితి లయకారుడైన విశాఖ స్వాములకు.. కోటానుకోట్ల భక్తులు, లక్షలాది జగనన్న అభిమానుల పక్షాన, ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. వీఐపీ, బకరా భక్తుల మాదిరిగా..  ఫ్లెక్సీలు, పేపర్ యాడ్లు ఇచ్చుకోలేని నిరుపేద భక్తులను.. విశాఖ పీఠం క్షమించాలి!

-మార్తి సుబ్రహ్మణ్యం

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.