TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవార్ మహా రాజకీయం.. ఇండియా కూటమికి చిక్కులేనా?

Published on: Mon Aug 14, 2023 12:47PM

శరద్ పవార్ అంటేనే కాకతు తీరిన రాజకీయ దురంధరుడు. ఆయన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలూ చివరి నిముషం వరకూ ఎవరికీ అర్ధం కావు. తన రాజకీయ చతురత, వ్యూహాలతో 38 సంవత్సరాల పిన్న వయస్సులోనే మహారాష్ట్ర వంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ పరమపద సోపానపటంలో నిచ్చెనలే ఎక్కుతూ వచ్చారు.  ఆయనతో ఢీ కొన్న వారే పాముల బారిన పడ్డారు. కాంగ్రెస్ ను ఢీ కొని  నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ స్థాపించి కూడా నిలదొక్కుకుని స్వల్ప కాలం మినహా అధికారంలో కొనసాగారంటే ఆయన రాజకీయ రణరంగపుటెత్తులు ఏ స్థాయిలో ఉంటాయో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఆయన చుట్టూనే మహా రాజకీయాలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఒక్క మహా రాజకీయాలనేమిటి? 

 82 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.   999లో ఎన్సీపీని స్థాపిస్తే అప్పటినుంచి 2014 వరకు మహారాష్ట్రలో  ఎన్సీపీయే అధికారం చెలాయించింది.  శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు చూశారు.  2019-22 మధ్య ఎన్సీపీ అక్కడి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామి. దీన్నిబట్టే పవార్ లకు పవర్ తో ఎంత అనుబంధం ఉందో తెలిసిపోతుంది. అయితే.. నిరుడు మహా వికాస్ అఘాడీ సర్కారు కూలిపోవడంతో అజిత్ పవర్ కోల్పోయారు. దీంతో ఏకంగా బాబాయ్ ను ధిక్కరించి ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చి బీజేపీ సర్కారులో చేరిపోయారు.  

ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మరో వైపు శరద్ పవార్ ప్రతిపక్ష  ఇండియా కూటమి ఏర్పాట్ల ప్రయత్నాల్లో ఉంటే.. మరోవైపు అజిత్ ఆయనకు వెన్నుపోటు పొడిచినట్లు ఇప్పటి వరకూ అంతా భావించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే..ఇదంతా శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అసలు ఎన్సీపీ చీలిక తరువాత చీలిక వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం.. ఆయన ఆశీర్వదించడం వంటి వరుస సంఘటనలతో అప్పట్లోనే శరద్ పవార్ ఏదో వ్యూహంతోనే  తెర వెనుక నిలబడి ఇదంతా జరిపించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  ఇప్పటికీ శరద్ పవార్ ఇండియా కూటమిలోనే ఉన్నారని బయటకు కనిపిస్తున్నది. తన శ్రేయోభిలాషులు బీజేపీతో కలిసి వెళ్లాలని సూచిస్తున్నారంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మాటలు ఆయన అజిత్ పవార్ తో భేటీ తరువాత చెప్పారు. పార్టీని నిట్టనిలువుగా చీల్చిన అజిత్ పవార్.. తన బాబాయ్ (శరద్ పవార్)తో తరచూ భేటీ అవుతుండటం చూస్తుంటే.. ఇండియా కూటమిలో ఉంటూ శరద్ పవార్ తెరవెనుక బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.  

తనను బీజేపీలో చేరాలని కొంతమంది హితైషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని  అయితా తాను ససేమిరా అన్నారనీ ఉటంకించారు.  అజిత్ తో భేటీ తరువాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. శరద్ పవార్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా వ్యూహ రచన చేస్తున్నారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం, అందుకు ప్రతిఫలంగా ఇండియా కూటమిని బలహీన పరిచి కేంద్రంలో మరో సారి బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యేందుకు ఇతోథికంగా సహకరించడం అన్న ఎత్తుగడతో శరద్ పవార్ సాగుతున్నారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వ్యక్తం అవుతున్నాయి.

 ప్రతిపక్షాల మహా కూటమి ''ఇండియా''.. ఇప్పటికే పట్నా, బెంగళూరులో సమావేశమైంది. తదుపరి సమావేశం ఈ నెలాఖరులో మహా రాజధాని ముంబైలో  ముంబైలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్, శరద్ పవార్ భేటీ,  ఆ తరువాత శరద్ పవార్ బీజేపీ కూటమిలో చేరిక వ్యాఖ్యలు రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత సంతరించుకున్నాయి.