తెరాసలో చేరనందుకే ఈ కక్ష సాధింపు చర్యలు : సండ్ర

 

నిన్న సాయంత్రం తెదేపా ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ అదుపులోకి తీసుకొన్న ఎసిబి అధికారులు ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత మళ్ళీ తమ కార్యాలయానికి తరలించారు. మరి కొద్ది సేపటిలో ఎసిబి కోర్టులో ఆయనను ప్రవేశపెట్టి కస్టడీ కోరవచ్చును. ఆయన ఎసిబి విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరెస్ట్ తరువాత తెరాస చెందిన కొందరు మధ్యవర్తులు వచ్చి తనను కలిసి తెరాసలో చేరమని కోరారని తెలిపారు. తెరాసలో చేరినట్లయితే ఎటువంటి కేసులు, సమస్యలు ఉండవని హామీ కూడా ఇచ్చేరని కానీ తను తెదేపాలో కొనసాగేందుకే మొగ్గు చూపడంతో ఆ మరునాడే ఎసిబి నుండి నోటీసులు వచ్చేయని తెలిపారు. కానీ తాను ఇటువంటి బెదిరింపులకి ఎంత మాత్రం భయపడబోనని, తను అరెస్టుకి సిద్ధమయ్యే వచ్చేనని తెలిపారు.

 

ఆయన విచారణకు హాజరయినప్పటికీ అరెస్ట్ చేయడాన్ని తెదేపా నేత జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా ఖండించారు. ఆయనను అరెస్ట్ చేయడాన్ని దళితులపై జరుగుతున్న దాడిగానే చూస్తామని అన్నారు. తెరాసలో చేరనివారిపై ఈవిధంగా తెరాస ప్రభుత్వం కక్ష పూరిత చర్యలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెరాస ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎమ్మేల్యేలని నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవాలని ప్రయత్నించడాన్ని ఆయన ఆక్షేపించారు. తమ పార్టీ తెరాసను రాజకీయంగా ఎదుర్కొంటుందని హెచ్చరించారు.