ఇసుక వ్యవహారం జగన్ కొంప ముంచుతుందా ?

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని వైసీపీ ఉద్యమాలు చేసిన రోజుల్లో లారీ ఇసుక రూ. పదివేల లోపే ఉంది. 

నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడడానికి ఒక కారణం ఇసుక మాఫియా అనే అంటారు. పేరుకు ఉచితం అన్నా డ్వాక్రా మహిళల పేరిట కార్యకర్తలు అక్రమంగా సంపాదిస్తున్నా మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. ఇసుక మాఫియా గురించి ప్రతిపక్షంలో వున్నన్ని రోజులు ఉద్యమాలు చేసి ఊదరగొట్టిన వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా ఎటువంటి పాలసీ తేకపోవడం చాలా ఇబ్బంది కర పరిస్థితులకి దారి తీస్తోంది. 

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఇసుక ర్యాంప్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తరువాత కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణలో ఇసుకను విక్రయిస్తూ ఉండటంతో మళ్ళీ మాఫియా సీన్ లోకి దిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎమ్యెల్యే, ఎంపీలు తమ పరిధిలో వున్న కొద్దిపాటి రీచ్ లపై అనధికార పెత్తనం మొదలు పెట్టేశారని తెలుస్తూనే ఉంది. 

ఇవి ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటున్న వైఎస్ జగన్ కి ఇసుక వ్యవహారం లేని పోని తలవంపులు తెచ్చిపెడుతోంది. ఇసుక సప్లై నిలిచిపోయిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కాదు చాలా రంగాల్లో స్థబ్ధత నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇటుక పరిశ్రమ, ఇతర భవన నిర్మాణ సామాగ్రి విభాగాలన్నీ పూర్తిగా డల్ అయిపోయాయి. నెలలు తరబడి నిర్మాణాలు వాయిదా పడితే బ్యాంక్ రుణాలతో గృహాలు నిర్మించుకునే వారికి వడ్డీల భారం అధికమౌతుంది. 

లక్షలాదిమంది ఆధారపడే భవన నిర్మాణ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం మరింత ముదరకముందే వైసిపి సర్కార్ ఏదో ఒక విధానం ప్రవేశపెట్టి కాపాడాలని మొత్తుకుంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు ఇసుక విషయంలో ఎన్ని కట్టడులు చేసినా మాఫియా చెలరేగిపోతూండటంతోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు భరించి ఎవరైనా ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని తీసుకొచ్చారు. 

అయితే ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఆ పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుక నుంచి భారీగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఎంత టీడీపీ నేతలు మాఫియాగా మారినట్లు ఆరోపణలు ఉన్నా అప్పట్లో లారీ ఇసుక రూ. పదివేల కన్నా తక్కువే ఉండేది. మరిప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో కట్టడి చేయకుంటే మరింత చెడ్డ పేరు రావడం ఖాయం.