TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జపాన్ చరిత్రలో తొలి మహిళా ప్రధాని

Published on: Tue Oct 21, 2025 12:56PM

 

జపాన్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నేత సనా తకాయిచి  ఎన్నికై చరిత్ర సృష్టించారు. నిన్న జరిగిన పార్లమెంట్ లోయర్ హోస్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 465 స్థానాలున్న దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనా తకాయిచికి 237 ఓట్లు లభించాయి. దీంతో ఆమె మెజారిటీ మార్కును సునాయాసంగా దాటారు. ఎగువ సభ ఆమోదం కూడా పొందిన తర్వాత, ఈ సాయంత్రం ఆమె జపాన్ 104వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

చక్రవర్తిని కలిసిన అనంతరం ఆమె అధికారికంగా బాధ్యతలు చేపడతారు. కాగా ఐరన్ లేడి ఆఫ్ జపాన్‌గా గుర్తింపు పొందారు. గత నెలలో ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మాజీ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగాల్సి వచ్చింది.చైనా విధానాలపై తీవ్ర విమర్శలు చేసే వ్యక్తిగా పేరుగాంచిన తకాయిచి, గతంలో ఒక హెవీ మెటల్ డ్రమ్మర్‌గా కూడా పనిచేశారు. అక్టోబర్ 4న అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు. 

అయితే, ఆమె కన్జర్వేటివ్ భావాలు, పార్టీలోని నిధుల కుంభకోణం కారణంగా పాత మిత్రపక్షం కొమెయిటో పార్టీ సంకీర్ణం నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో ఎల్‌డీపీ కొత్త పొత్తు కోసం ప్రయత్నించి, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (జేఐపీ)తో సోమవారం సాయంత్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తకాయిచి మాట్లాడుతూ "జపాన్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాను. భావితరాలకు బాధ్యత వహించే దేశంగా జపాన్‌ను తీర్చిదిద్దుతా" అని హామీ ఇచ్చారు.