ఇది టీడీపీ కాదు పహిల్వాన్ గిరి చేయడానికి... రేవంత్ పై వీహెచ్, సంపత్ ఫైర్

 

హుజుర్ నగర్ ఉపఎన్నిక అభ్యర్ధి వివాదంలో రేవంత్ రెడ్డి టార్గెట్ గా అటాక్ పెరుగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలంతా దాడి చేస్తుంటే, ఇప్పుడు వీహెచ్ అండ్ సంపత్ కుమార్ మాటల తూటాలు విసిరారు. కోర్ కమిటీలో చర్చించాకే హుజుర్ నగర్ అభ్యర్ధిగా ఉత్తమ్ సతీమణి పద్మావతిని ప్రకటించారని, ఆ సమావేశంలో రేవంత్ కూడా ఉన్నారని, ఇప్పుడిలా మాట్లాడటం సరికాదంటూ మండిపడ్డారు. అయితే, కాంగ్రెస్ ఏమీ టీడీపీలాగా ప్రాంతీయ పార్టీ కాదు.... పహిల్వాన్ గిరి చేయడానికి అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు. 

ఇక, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా రేవంత్ పై సెలైంట్ అటాక్ చేశారు. యురేనియంపై తనకు ఏబీసీడీలు తెలియకుండానే ఢిల్లీ వెళ్లి పోరాడానా అంటూ ప్రశ్నించారు. తాను ఏదేనా పార్టీ మీటింగ్ లోనే మాట్లాడానన్న సంపత్....రేవంత్ లాగా మీడియా ముందు వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా, కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ, పవన్ కు రిపోర్ట్ ఇవ్వడమేంటంటూ సంపత్ ప్రశ్నించారు. అసలు జనసేన బ్యానర్ కింద కాంగ్రెస్ నేతలెందుకు పనిచేయాలని సంపత్ నిలదీశారు. అన్ని క్యారెక్టర్లు తనవేనని రేవంత్ అనుకుంటాడని, కానీ కాంగ్రెస్ లో అవి చెల్లవన్నారు. తనతోనే సెల్ఫీలు దిగేవాళ్లు బోలెడంత మంది ఉంటే, తనకు పవన్ తో సెల్ఫీ దిగాల్సిన అవసరమే లేదన్నారు. పీసీసీ చీఫ్ ఇవ్వాలని తాను ఎవర్నీ అడగలేదని, కానీ ఏఐసీసీ నా బయోడేటా అడిగిందని సంపత్ చెప్పుకొచ్చారు. అయినా, ఎప్పుడూ రెడ్డిలు, బీసీలేనా? ఎస్సీలకు కూడా పీసీసీ పగ్గాలు ఇవ్వాలని సంపత్ డిమాండ్ చేశారు.

ఇక, రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఆగ్రహం వ్యక్తంచేసింది. రేవంత్ వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డ కమిటీ.... ఏం చేయాలన్నదానిపై ఏఐసీసీని సంప్రదించాలని నిర్ణయించింది. అంతేకాదు, అసెంబ్లీలో ఎప్పుడు ఏ అంశం మాట్లాడాలో సీఎల్పీ నేతకు తెలుసన్న క్రమశిక్షణా కమిటీ... రేవంత్ వ్యాఖ్యలతో ఇటీవల పెరిగిన పార్టీ గ్రాఫ్ పడిపోయే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించింది.