అదే రహస్యం.. అదే గోప్యం.. ఈ సారేం మాట్లాడారో?
Published on: Fri Jun 3, 2022 10:41AM
ఏం చేస్తారో చెప్పరు.. చెప్పిందేమీ చేయరు.. అసలేం జరుగుతోందో బయటకు తెలియనీయరు. ఇదీ ఏపీలో జగన్ ప్రభుత్వం ఈ మూడేళ్లుగా వ్యవహరించిన తీరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై కాడి వదిలేసిందంటూ అప్పటి అధికార పక్షంపై నిప్పులు చెరిగిన జగన్ అధికారంలోకి వచ్చాకా ఆ ఊసే మరిచారు. ముఖ్యమంత్రి హోదాలో పలు మార్లు మోడీతో భేటీ అయినా ఆ భేటీలో చర్చించిన అంశాలేమిటి, ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్నది ఎప్పడూ వెల్లడించలేదు. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో దాదాపు పీఎంవోలోనే మకాం వేస్తారు. అక్కడేం చేస్తున్నారో చెప్పరు. ఇక తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రధానితో గురువారం దాదాపు 45 నిముషాల పాటు భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఏం చర్చించారన్నది రాజకీయ పరిశీలకుల, విలేకరుల ఇంటర్పటేషనే కానీ.. జగన్ నోటి వెంట ఏం ఒక్క మాట కూడా రాలేదు. అయితే గత భేటీలకు, తాజా భేటీకి ఒక స్పష్టమైన తేడా మాత్రం ఉంది. గత భేటీలన్నీ జగన్ బతిమాలుకుని అప్పాయింట్ మెంటు తీసుకున్నవే.
ఆ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించి ఉంటారని భావించడం అత్యాశే అవుతుందన్నది అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలతో చెప్పేశారు. జగన్ ఆర్థిక నేరాల కేసులను ఎదుర్కొంటున్నారు. అన్నీ తీవ్రమైన కేసులే కనుక వాటి విషయంలోనే జగన్ మోడీతో భేటీలను, విజయసాయి పీఎంవో విజిట్లను వారు ఉపయోగించుకుని ఉంటారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణను జాప్యం చేసేందుకు ఉన్న అవకాశాలన్నిటినీ వినియోగించుకునే వెసులు బాటు కోసమే ఆ భేటీలు, విజిట్ లు అన్నది పరిశీలకుల అభిప్రాయం.
విపక్షంలో ఉండగా ఒక్క చాన్స్ ఇస్తే తానేం చేస్తారో పదే పదే చెప్పిన జగన్ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత విపక్ష నేతగా ఏం చెప్పారో అవి మాత్రం పట్టించుకోవడం మానేశారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్.. ఇలా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ విపక్ష నేతగా తాను అధికారంలోకి వస్తే వీటన్నిటినీ చిటికెలో సాధించేస్తానని చెప్పిన జగన్ ముఖ్యమంత్రిగా వాటి గురించి ప్రస్తావించిన దాఖలాలే లేవని పరిశీలకులు అంటున్నారు. సంక్షేమం పేరిట సొమ్ము పందేరానికే ఉన్న నిధులన్నీ వాడుస్తూ ఏరోజు కారోజు అప్పుల కోసం దేవులాడుకోవడంతోనే కాలం గడిపేశారు. అయితే తాజా భేటీలో ఇంత కాలం తాను విస్మరించిన అంశాలపై డిమాండ్ చేసే అవకాశం ఆయనకు వచ్చింది.
అసలు హఠాత్తుగా సీఎం జగన్ ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారన్న విషయంలోనే స్పష్టత లేదు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మద్దతు కోరేందుకు ప్రధానే ఆయనను పిలిపించుకున్నారా? లేక మద్దతు ఇస్తాం అంటూ స్వచ్ఛందంగా ఈయనే వెళ్లి కలిశారా అన్న విషయంలో ఎటువంటి స్పష్టతా లేదు. భేటీ అనంతరం ప్రధానితో సమావేశం సామరస్య పూరిత వాతావరణం సజావుగా సాగిందన్న ప్రకటనతో సరిపెట్టేశారు. అనుకూల మీడియా మాత్రం యధా ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ఇలా పలు డిమాండ్లను జగన్ ప్రధాని ముందు పెట్టినట్లుగా కథనాలు ప్రచురించేసింది. అయితే వాస్తవంగా ప్రధానితో భేటీలో జగన్ ప్రస్తావించిన అంశాలేమిటన్న విషయం మాత్రం బయటకు పొక్కనీయడం లేదు.
నిజంగానే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లన్నీ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించి ఉంటే.. ఆయన సానుకూలంగా స్పందించి ఉంటే.. ప్రధాని తరువాత నిర్మలా సీతారామన్ తో భేటీ అంత క్లుప్తంగా, అంత త్వరగా ఎందుకు పూర్తి అవుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జగన్ ప్రధానిని డిమాండ్ చేసినట్లుగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పుకుంటున్న అంశాలన్నీ ఆర్థిక పరమైనవే. అటువంటప్పుడు ప్రధాని సానుకూలంగా స్పందించి ఉంటే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సుదీర్ఘంగా సాగి ఉండాల్సింది. అందుకు భిన్నంగా ఏదో వెళ్లి కలిసి వచ్చేశామన్నట్లుగా నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ ఉంది.
మహా అయితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది కనుక మరిన్ని అప్పులకు వెసులు బాటు కల్పించాలని జగన్ కోరి ఉండొచ్చు. అంతే అంతకు మించి జగన్ కేంద్రం ఎదుట తన గళమెత్తే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు అంటున్నారు. అందుకే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విషయంలో ఎప్పటి గోప్యతే కొనసాగుతోందని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాలంటే కచ్చితంగా జగన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కేంద్రానికి అవసరం. అందుకే పీఎం జగన్ ను పిలిపించుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేంద్రం పిలుపు మేరకు వెళ్లినా జగన్ ప్రధాని వద్ద ప్రదర్శించిన హావభావాలు, వంగి వంగి మాట్లాడటం చూస్తుంటే.. ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించిన అంశాలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకూ సంబంధించినవి అయి ఉండవనీ, ఔటాఫ్ ది వే.. తన వ్యక్తిగత అవసరాలకు సంబంధించి (అంటే కేసులకు సంబంధించి) అయి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.


