నేరం మాది కాదు ప్రజలదే

 

Samaikyandhra Movement,Samaikyandhra agitation, telangana, Samaikyandhra, congress

 

 

సమైక్యాంధ్ర ఉద్యమాల నుండి ప్రజలు వెనక్కి తగ్గారు. ఉద్యోగులు చేత చాకచక్యంగా సమ్మెవిరమింపజేయడం కూడా పూర్తయ్యింది. అందుకు దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు చెప్పారు కూడా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా సమైక్యాంధ్ర కాడి పక్కన బెట్టినట్లే మాట్లాడుతున్నారు. కావాలంటే రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందంతో ఉద్యోగులకు సమావేశం కూడా ఏర్పాటు చేయగలనని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇంతవరకు సమైక్యాంధ్ర కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో అలసిపోయినప్పటికీ పురందేశ్వరి వంటి కొందరు కాంగ్రెస్ నేతలు, ప్రజలు యదార్ధ పరిస్థితులను గ్రహించాలని ఒక ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా, వారికి మంచి ప్యాకేజీ సాధించేందుకు మరో కొత్త పోరాటానికి నడుం బిగిస్తున్నారు.

 

 

ఇక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన అంశం కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో బాగా దెబ్బ తిన్నకాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, రెండు ప్రాంతాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్నికలు వచ్చి మీద పడేలోగా జనాలని మరిపించి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడం ఎలాగో ఆలోచించెందుకే ఈ సమావేశాలని ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. మరో పక్క తెలంగాణా రాష్ట్రం సాదించినందుకు సంబరాలు చేసుకొంటున్నటీ-కాంగ్రెస్ నేతలు సీమాంధ్రకి మంచి ప్యాకేజి వచ్చేలా తాము కూడా హైకమాండుకి గట్టిగా రికమెండ్ చేస్తామని అభయ హస్తం ఇస్తున్నారు. అదేవిధంగా సీమంధ్ర ప్రజలకి అన్నివిధాల అండగా నిలుస్తామని హామీ కూడా ఇస్తున్నారు. మరో పక్క డిల్లీలో కేంద్రమంత్రుల బృందం ఈ రోజు రెండో సమావేశం నిర్వహిస్తూ రాష్ట్రవిభజన ప్రక్రియని ముందుకు తీసుకు వెళుతోంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం వ్రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయని అర్ధం అవుతోంది.




ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో సహా నేతలందరూ తమకు అధిష్టానం కేటాయించిన పాత్రలు అద్భుతంగా పోషించి ఈ సమైక్యడ్రామాను మంచి రక్తి కట్టించారు. కానీ వారి పాత్రలను అర్ధం చేసుకోవడంలో ప్రజలే అపోహలకు లోనయ్యి పాపం! ఏ పాపం ఎరుగని కాంగ్రెస్ నేతలను నిందిస్తున్నారు. ప్రజలకెందుకు ఆ అవకాశం ఈయలని లగడపాటి వంటి వారు తమని తామే తిట్టుకొంటూ అదేనోటితో పార్టీని, పార్టీలో కొందరు నేతలని కూడా తిడుతున్నారు. సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసినా, ప్రజలు చైతన్య వంతులుగాకపోతే పాపం! వారు మాత్రం ఏమిచేయగలరు? తప్పు ప్రజలదే తప్ప వారిది కాదు.