సమైక్య కాంగ్రెస్ నేతలు ఒంగోలులో భూముల కొనుగోళ్ళు

 

ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన కధనం వచ్చింది. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తూనే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా ఏఏ ప్రాంతాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయో తెలుసుకొనేందుకు డిల్లీలో సంబందిత నేతలు, అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరిగి భోగట్టా చేసి కొత్త రాజధానికి పరిశీలనలో ఉన్న ప్రాంతాలుగా చెప్పబడుతున్నఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలుచేస్తున్నట్లు సమాచారం.

 

ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఒంగోలు వద్ద దాదాపు 1400 ఎకరాల భూమిని విభజన ప్రకటన వెలువడిన తరువాత కొనుగోలు చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. అదేవిధంగా గుంటూరులో గల చిలుకలూరిపేట-ఒంగోలు మద్య భూములను కూడా అయన కొన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

 

ఒకవైపు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేస్తూనే మరోవైపు జోరుగా సమైక్యాంద్రా ఉద్యమాలు సాగించడం ద్వారా, ఇప్పుడప్పుడే రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవనే భావన ప్రజలలో కలుగజేసి, తద్వారా తమ కొనుగోళ్ళు పూర్తయ్యేవరకు భూమి ధరలు పెరగకుండా అదుపులో ఉండేలా సదరు నేతలు జాగ్రత్త పడుతున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇక, రాష్ట్ర విభజన జరగడం అనివార్యమని తెలిసి ఉన్నపటికీ, అది బయటపెట్టకుండా ప్రజలతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం ద్వారా వారి అభిమానం సంపాదించుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించవచ్చుననే ఆలోచన కూడా ఉంది. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన వాగ్వాదంలో ఈ విషయాలన్నీ బయటకి పొక్కినట్లు ఆ పత్రిక పేర్కొంది.