మజ్లిస్ పార్టీకి ఊపిరిపోసిన సల్మాన్ ఖాన్

 

కొద్ది రోజుల క్రితం బాలివుడ్ హీరో సల్మాన్ ఖాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి అహ్మదాబాద్ లో నిర్వహించిన పతంగుల పండుగలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోడీ మంచి సమర్దుడయిన పరిపాలకుడని, ఆయన ప్రధానమంత్రి అయినట్లయితే దేశం అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో దూసుకుపోతుందని మోడీని తెగ పొగిడేశారు. ముస్లిం మతస్తుడయిన సల్మాన్ ఖాన్ వంటి ఒక ప్రసిద్ద నటుడు నరేంద్ర మోడీకి ఆవిధంగా మద్దతు ప్రకటించడం చాలా మంది జీర్ణించుకోలేకపోయినప్పటికీ, సల్మాన్ ఖాన్ వ్యక్తిగత అభిప్రాయాన్ని ఖండించడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, సల్మాన్ ఖాన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ “నరేంద్ర మోడీకి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది గనుక 2002లో జరిగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆయన గుజరాత్ ప్రజలకు క్షమాపణ చెప్పనవసరం లేదు,” అన్నట్లు వచ్చిన వార్తలు మోడీ ప్రత్యర్ధులకు ఒక ఆయుధం అందించింది.

 

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తమ పార్టీని రాష్ట్రమంతటా విస్తరించి, వచ్చే ఎన్నికలలో ముస్లిం ప్రజల ఓట్లను పొంది, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఆశపడ్డారు. మర్రి నీడవంటి కాంగ్రెస్ క్రింద ఎంతకాలం ఉన్నా తమ పరిస్థితిలో మార్పు ఉండదని భావించిన ఓవైసీ సోదరులు కిరణ్ కుమార్ రెడ్డితో గిల్లికజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ నుండి బయటపడ్డారు, కానీ ఊహించనివిధంగా అనేక చిక్కులో పడ్డారు. నాటి నుండి నేటివరకు తగిన అవకాశం కొరకు వారు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మోడీని వెనకేసుకురావడంతో దొరికిన అవకాశాన్ని అందుకొని, అసదుద్దీన్ ఓవైసీ వారిరువురిపై నిప్పులు చెరిగారు. “ఈ సినిమా హీరోలు తామే అసలయిన హీరోలని భావిస్తుంటారు. కానీ ముస్లిం ప్రజలకు అల్లా ఒక్కడే నిజమయిన హీరో. ఇటువంటి నీచులు వేలాది ముస్లిం ప్రజల మరణానికి కారకుడయిన మోడీ వెనుక, తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తోక ఊపుకొంటూ తిరుగుతారు. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు ఎవరూ కూడా వారి వెనుక వెళ్లరు. నరేంద్ర మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇవ్వొచ్చుగాక, సల్మాన్ ఖాన్ వంటి ముస్లిం వ్యక్తులతో క్లీన్ చిట్ ఇప్పించుకోవచ్చుగాక. కానీ జరిగిన దారుణాన్ని ముస్లిం ప్రజలెన్నడూ మరిచిపోలేరు. మోడీని క్షమించలేరు,” అని అన్నారు.

 

నరేంద్ర మోడీని, బీజేపీని తీవ్రంగా ద్వేషించే అసదుద్దీన్ ఓవైసీ ఈవిధంగా విరుచుకుపడటం సహజమే కావచ్చు. కానీ, బీజేపీ ప్రధాని అభ్యర్ధి అయిన నరేంద్ర మోడీపై ఆయన ఈవిధంగా తీవ్ర విమర్శలు గుప్పించడం ద్వారా మోడీపై తన ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాటు, పనిలోపనిగా యావత్ ముస్లిం ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాను, తన పార్టీయే ముస్లిం ప్రజలకు అసలు సిసలయిన ప్రతినిధులమని, తాము మాత్రమే వారి కోసం ఎంతటి వారినయినా దైర్యంగా డ్డీకొని పోరాటం చేయగలమని ముస్లిం ప్రజలకు నమ్మకం కలిగించేందుకే అసదుద్దీన్ సల్మాన్ ఖాన్, మోడీలపై అంత తీవ్రంగా విరుచుకుపడ్డారని చెప్పవచ్చును.

 

సల్మాన్ ఖాన్ నరేంద్ర మోడీని వెనకేసుకు రావడం వలన మోడీకి, బీజేపీకి మేలు కలుగుతుందో లేదో, ముస్లిం ఓట్లు పడతాయో లేదో ఇప్పుడే చెప్పలేకపోయినా, ఆయన చేసిన వ్యాక్యల వల్ల మజ్లిస్ పార్టీకి మళ్ళీ ఊపిరి అందించినట్లయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును.