మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు వినబడటం లేదా?

సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలు నిజమేననిపిస్తున్నాయి. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే జగన్... అధికారంలోకి వచ్చాక అనేక హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను విన్నాను... నేను ఉన్నానంటూ చెప్పే సీఎం జగన్... కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోస మాత్రం వినడం లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంత్రుల దగ్గర పీఆర్వోలుగా చేరి ఆర్నెళ్లు అవుతున్నా ఇఫ్పటివరకు జీతం ఇవ్వలేదని, కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని మాజీ జర్నలిస్టులు ఆవేదనకు గురవుతున్నారు.

మంత్రులు తమకు నచ్చినవాళ్లను పీఆర్వోలుగా ఏర్పాటు చేసుకున్నాక అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జీఏడీకి లేఖలు రాశారు. అలాగే నెలకు 30వేలు వేతనం ఇవ్వాలని సూచించారు. అయితే, 30వేలు సరిపోవని, కనీసం 50వేలు ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. మంత్రుల లేఖలు ఆర్ధికశాఖకు వెళ్లాయి. అయితే, పీఆర్వోలకు 30వేలు సరిపోతాయని ఆర్ధికశాఖ మెలిక పెట్టడంతో ఆ ఫైల్ ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా, పీఆర్వోలు మాత్రం మంత్రుల దగ్గర గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇవాళోరేపో అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వస్తాయని, జీతాలు కూడా వస్తాయన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఆర్నెళ్లు దాటినా ఇంకా అపాయింట్ మెంట్లు, జీతాలు రాకపోవడంతో పీఆర్వోలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమలిపోతున్నారు. అయితే, మంత్రుల పీఆర్వోలకు సంబంధించిన ఫైలు ఇప్పటివరకు సమాచారశాఖకు అందలేదని అంటున్నారు. అక్కడ్నుంచి ఫైలు ముందుకు కదిలితే తప్ప పీఆర్వోలకు జీతాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు. 

తమ పాలనలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటూ గొప్పుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని అంటున్నారు. కనీసం మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలకే జీతాలు ఇవ్వకపోతే, ఇక మిగతా ఉద్యోగుల బాధలు ఎలా అర్ధమవుతాయని అంటున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాననే జగన్మోహన్ రెడ్డికి... సచివాలయంలో మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల దుస్థితి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరి, మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు ఎప్పుడు వినబడుతుందో... వాళ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయో... ఆ దేవుడికే తెలియాలి.