సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది... ఇక మిగిలింది కొమ్మినేని ఒక్కరే..!

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో సాక్షి ఉద్యోగుల పంట పండుతోంది. ఒకరి తర్వాత మరొకరికి కేబినెట్ ర్యాంక్ పదవులు దక్కుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ లను మించిన జీతాలు, సౌకర్యాలతో కీలక పదవులు కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డిని సలహాదారుగా నియమించుకుని కేబినెట్ ర్యాంకు కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... ఆ తర్వాత సాక్షి ఉద్యోగులు కృష్ణమోహన్, హరికృష్ణలను సీఎంవోలోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ జర్నలిస్టు దేవుపల్లి అమర్ ను జాతీయ మీడియా - ఇంటర్ స్టేషన్ మీడియా సలహాదారుగా నియమించుకుని నెలకు దాదాపు 4లక్షల జీతం, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇక ఇఫ్పుడు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తిని ప్రజాసంబంధాల సలహాదారుగా నియమించారు. అయితే, రామచంద్రమూర్తి కూడా తెలంగాణ జర్నలిస్టే. అయితే, వీళ్లందరికీ సాక్షిలో ఏ స్థాయిలో జీతాలు ఇచ్చారో తెలియదు కానీ, ప్రభుత్వం మాత్రం 4లక్షలపైనే వేతనమిస్తూ, అలవెన్సులు, సౌకర్యాలు అదనంగా కల్పిస్తోంది. ఇక వీళ్లే కాకుండా, పీఆర్వోలుగా, ఫొటో-వీడియోగ్రాఫర్లుగా, ఆఫీస్ బాయ్ లుగా దాదాపు 150మంది సాక్షి ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ డిజిటల్ మీడియాలోకి మరో 150మంది సాక్షి ఉద్యోగులనే తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

అయితే, సజ్జల, దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి, కృష్ణమోహన్, హరికృష్ణను వివిధ హోదాల్లో నియమించుకుని, పలువురికి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి... వీరభక్తుడైన కొమ్మినేని శ్రీనివాసరావుకు మాత్రం అన్యాయం చేస్తున్నారనే మాట వినిస్తోంది. తెలంగాణ జర్నలిస్టులందరికీ పెద్దపీట వేసిన జగన్..... అసలుసిసలు ఆంధ్రా జర్నలిస్టుకు మాత్రం ఇంకా ఎందుకు పదవి ఇవ్వలేదని అంటున్నారు. సాక్షిలో పెద్ద తలకాయలందరికీ దాదాపు పదవులిచ్చేశారు... ఇక, కొమ్మినేనికి కూడా ఏదోఒక కీలక పదవి ఇచ్చేస్తే బ్యాలెన్స్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. మరి వీరభక్తుడికి జగన్ ఏ పదవి కట్టబెడతారో చూడాలి.