వ్యర్ధమవుతున్న సాక్షర భారత్ నిధులు
Published on: Tue Feb 21, 2012 9:14AM
నీళ్ళప్రాయంగా నిధుల ఖర్చు,వయోజనులను చేరని లక్ష్యం
హై
దరాబాద్: సంపూర్ణ అక్షరాస్యత సాధనకోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ప్రవేశపెట్టిన సాక్షర భారత్ కార్యక్రమం అమలుతీరు రాష్ట్రంలో అత్యంత నిరాశాజనకంగా ఉంది. కోట్లాది రూపాయల నిధులు నీళ్ళప్రాయంగా ఖర్చవుతున్నా వయోజనులకు మాత్రం అక్షరం ముక్క రావడం లేదు. చాలా చోట్ల కేంద్రాలను తెరవకుండానే నిధులు స్వాహా చేస్తున్నారు. గౌరవ వేతనం, ఆటవస్తువులు, పత్రికలు, పుస్తకాల పేరిట పెద్దమొత్తంలో నిధులు ఖర్చయిపోతున్నాయి. ఉదయం 7 గంటలనుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కేంద్రాలు తెరిచి ఉండాలి. అయితే నూటికి 90శాతం కేంద్రాలు ఎప్పుడూ మూతపడే ఉంటున్నాయి.
పంచాయితీ పరిధిలో ఇద్దరు సమన్వయ కర్తలు 6 నెలల్లో 100మంది వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం ధ్యేయం. గ్రామ కోఆర్డినేటర్లకు నెలకురూ.2000,మండల కోఆర్డినేటర్లకు రూ.600 వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇది కాక కేంద్రం వీటి నిర్వహణకు ఏటా సుమారు రూ.15 వేలు మంజూరు చేసున్నారు.ఈ కేంద్రాలకు దిన పత్రికలు, కుర్చీలు, ఆటవస్తువులు, బీరువాలు కూడా సమకూర్చారు. అయితే ఇవన్నీ ఆయా కేంద్రాల్లో కాక గ్రామ కోఆర్డినేటర్ల ఇళ్ళలోనే మగ్గుతున్నాయి.


