TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జల ట్రబుల్ షూటరా? ట్రబుల్ మేకరా? .. !

Published on: Mon Apr 25, 2022 11:48AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం సలహాదారుగానే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ పాత్ర ద్వారా పార్టీ, ప్రభుత్వంలో సమస్యలు పరష్కారమౌతున్నాయా? లేదా కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయా అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదని పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నాయి. 

వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అనధికార నంబర్ 2గా కొనసాగుతున్నారు. మంత్రులకు బదులుగా ఆయన విలేకరుల సమావేశాలలో మాట్లాడుతారు. ప్రజా సమస్యలపై అడ్రస్ చేస్తారు. విపక్షపార్టీపై విమర్శలూ చేస్తారు.  అంతే ప్రభుత్వ సలహాదారుగానే కాకుండా పార్టీలో కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తుతున్నారు. 

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్టీలో ఒక్క సారగా అసమ్మతి జ్వాలలు ఎగసిపడనప్పుడు వాటిని చల్లార్చే బాధ్యతను కూడా సజ్జల తన భుజస్కంధాలపై వేసుకున్నారు. సరే ఎలాగోలా ఆ అసమ్మతి భుగభగలు సద్దుమణిగాయి. అయితే సజ్జల ట్రబుల్ షూట్ వల్లే అవి సద్దుమణిగాయని చెప్పజాలం.  సజ్జల తరువాత జగన్ కూడా రంగంలోకి దిగి నడుంబిగిస్తే కానీ అలజడి ఆగలేదు. ఇప్పటకీ నవురు గప్పిన నిప్పులా అసమ్మతి ఉండనే ఉంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు నుంచీ ఇటు నుంచి విమర్శల పాలైనది మాత్రం సజ్జలే. బుజ్జగింపుల పేరుతో మంత్రి పదవులు కోల్పోయిన వారికి కేబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వాల్సి రావడం ఆయన ట్రబుల్ షూటింగ్ కు ఏమంత వన్నె తేవదు. అదీ కాక జగన్ స్వయంగా రంగంలోనికి దిగి బుజ్జగించాల్సిన అవసరం రావడం కూడా ట్రబుల్ షూటర్ గా సజ్జల వైఫల్యమే కాకుండా అధినేతను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రబుల్ మేకర్ గా మారారని విమర్శలు ఎదుర్కొన్నారు. 
అలాగే ఇంతటి ప్రాముఖ్యమున్న  మరో ఘటనలోనూ ట్రబుల్ షూటర్ గా ఎంటరైన సజ్జల ట్రబుల్ మేకర్ గా నిందలను ఎదుర్కొన్నారు.   ఉద్యోగుల ఆందోళన సందర్భంగా వరుసగా జరిగిన చర్యలలో ముఖ్య సూత్రధారిగా వ్యవహరించిన సజ్జల ఆ తరువాత మంత్రి  బొత్ససత్యనారాయణ సహాయాన్ని కోరాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనూ సజ్జల ట్రబుల్ మేకర్ గానే వ్యవహరించారన్న విమర్శలు వినవచ్చాయి. ఎక్కడైనా ట్రబుల్ షూటర్ సమస్య పరిష్కారం చేసి ఇరు వర్గాల మెప్పూపొందుతారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితం రాబడతారు. కానీ సజ్జల విషయంలో పరిస్థితి పూర్తి రివర్స్ గా కనిపిస్తున్నది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అసమ్మతీయులు తమకు అన్యాయం జరగడానికి కారణం సజ్జలే అని నిందించారు. అదే విధంగా ఉపాధ్యాయ సంఘాలూ పీఆర్సీ విషయంలో సజ్జల వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో కూడా సీఎం విపక్ష నేతగా ఉండగా వివరం తెలియక హామీ ఇచ్చారంటూ ప్రకటించి సజ్జల జగన్ ను  అజ్ణానిగా ఉద్యోగుల ముందు నిలబెట్టారు. దీంతో పార్టీ వర్గాలలోనే సజ్జల  ట్రబుల్ షూటర్ కాదు.. ట్రబుల్ మేకర్ అంటూ జోకులు పెలుతున్నాయి.