మంత్రి కొడాలి నాని విపక్షాల ట్రాప్ లో పడిపోయారట.. సజ్జల రామకృష్ణారెడ్డి కవరింగ్

సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంలో మంత్రి కొడాలి నాని నోటి వెంట మాటల తూటాలు పేలిన సంగతి తెలిసందే. ఏపీలోని ప్రతిపక్షాలనే కాకుండా ఇటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సాక్షాత్తు అటు ప్రధాని మోడీ పై కూడా మాటలు తూలడంతో బీజేపీ నేతలు మండి పడుతున్నారు. కొడాలి నానిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనీ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వైసిపి నేతలు కవర్ చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా ఈ వివాదం పై వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మంత్రి నాని ప్రతిపక్షాల ట్రాప్ లో పడి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని.. ఆ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగతమైనవని.. ఇటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలను ఎవరిపై ఎవరు చేసినా సమర్థనీయం కాదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ రకమైన వ్యాఖ్యలు చేసి విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఆయన పార్టీ వర్గాలకు సూచించారు. 

 

సీఎం జగన్ నిన్న భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. ప్రతిపక్షాలు ఈ విషయం పై కాకుండా ప్రజా సమస్యలపై ధర్నా చేసి ఉంటే బాగుండేదని ఆయన సలహా ఇచ్చారు. అంతేకాకుండా సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఐతే రాష్ట్ర ప్రభుత్వంలోనే నెంబర్ 2 గా భావించే సజ్జల ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం గురించి మాట్లాడడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది.