TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సజ్జల వైఫల్యాల పరంపర.. వైసీపీలో ప్రతిష్ట పాతర!?

Published on: Sat Jul 26, 2025 2:32PM

వైసీపీలో పెద్ద సంక్షోభంలో కూరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో పై నుంచి కింది దాకా సజ్జలపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోతున్నది.తాడేపల్లి ప్యాలెస్ గుడ్ లుక్స్ లో ఉండటం వల్ల అది బహిర్గతం కావడం లేదని వైసీపీ నేతలే గుసగులాడుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పరిస్థితి చాలా వరకూ మారిపోయిందంటున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు కూడా సజ్జలపై పార్టీ నేతలలో వ్యతిరేకతను చల్లార్చగలిగే పరిస్థితి లుదంటున్నారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత పార్టీ క్యాడర్ కు భరోసా కల్పించడంలో.. అరెస్టు కారణంగా పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమంటున్నారు. అన్నిటికీ మించి సజ్జలపై జగన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. 

మద్యం కుంభకోణం విషయంలో అరెస్టులు అన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్న విషయాన్ని బలంగా చెప్పడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.  ఒక వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం విషయంలో... దర్యాప్తు సాగుతున్న తీరును.. బయటపడుతున్న వైసీపీ నేతల ప్రమేయాన్ని క్షుణ్ణంగా, పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తుంటే.. అందుకు దీటుగా దర్యాప్తు నుంచి అరెస్టుల వరకూ అంతా తెలుగుదేశం కూటమి సర్కార్ కక్షసాధింపే నంటూ వైసీపీ వాదాన్ని బలంగా ప్రజలకు వివరించే విషయంలో సజ్జల ఘోరాతిఘోరంగా విఫలమయ్యారని పార్టీ నేతలే అంటున్నాయి.  

ఈ వైఫల్యానికి తోడు సజ్జల ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో జగన్ అరెస్టుకు సంబంధించిన సంకేతాలు ఇవ్వడం పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేయడమే కాకుండా వారి మనో ధైర్యాన్ని కూడా దెబ్బతీసిందంటున్నారు. సజ్జల చెప్పిన ప్రతిమాటా, ప్రతి కౌంటర్.. గతంలో అంటే జగన్ హయాంలో జరిగిన అడ్డగోలు అరెస్టులపై చర్చకు తెరలేపేవిగా ఉండటంతో సజ్జల తీరుపై జగన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా జగన్ హయాంలోలా అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి ఇప్పుడు అరెస్టులు జరగడం లేదు. అరెస్టుకు ముందు నిందితులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలూ వినియోగించుకునే అవకాశం దొరుకుతోంది. చివరకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాతనే అరెస్టులు జరుగుతున్నాయి. దీంతో వీటిని కక్ష సాధింపు అరెస్టులుగా సజ్జల ఎంత నెత్తీ నోరూ బాదుకుంటూ చెబుతున్నా జనం నమ్మడం లేదు.  సో సజ్జల వైఫల్యాల జాబితా ముందు ముందు మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అంటే సజ్జలపై పార్టీలో మరింత వ్యతిరేకత ప్రోది అవుతుందనడంలో సందేహమే లేదు.