జగన్ వర్సెస్ సజ్జల: వైసీపీలో సైలెంట్ వార్.. స్థానిక సమరం ముంగిట కొత్త తలనొప్పి.?
Published on: Mon Oct 5, 2026 10:10AM

వైసీపీ వరుస సంక్షోభాలతో కూనారిల్లుతోందా? స్థానిక ఎన్నికలను లిట్మస్ టెస్టుగా తీసుకుని 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్వ వైభవం సంతరించుకోవాలని ప్రయత్నిస్తున్న జగన్ కు పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవా. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో అంతర్గత విభేదాలు వైసీపీని బలహీనపరుస్తున్నాయా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది.
.webp)
స్థానిక ఎన్నికలకు సమాయత్తమయ్యే వ్యూహాలకు సంబంధించి పార్టీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ అధినేత జగన్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయని అంటున్నారు. దాదాపుగా ఇరువురి మధ్యా సైలంట్ వార్ జరుగుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల బహిష్కరణే బెటర్ అని సజ్జల చెబుతుంటే.. బరిలో నిలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ఈ విషయంలోనే ఇరువురి మధ్యా విభేదాలు పీక్స్ కు వెళ్లాయంటున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ క్షేత్రస్థాయిలో బాగా బలహీనపడింది. పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి దూరమయ్యారు. అవుతున్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ గా నిలిచి, బలంగా గళం వినిపించి ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, విడదల రజని వంటి నేతలు సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాలలో కూడా నామ్ కే వాస్తేగా పాల్గొంటూ ఇన్ యాక్టివ్ గా మారిపోయారు. దీంతో గ్రామ స్థాయిలో క్యాడర్ బలహీనపడింది.అంతెందుకు, జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం రాష్ట్రంలో వైసీపీ పరిస్థితికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. . ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులే కరవయ్యే పరిస్థితి ఉందన్నది సజ్జల వాదనగా చెబుతున్నారు. అధవా పోటీ చేసినా పరాభవం తప్పదనీ, అందుకే బాయ్ కాట్ చేసి పరువు కాపాడుకోవడం బెటరన్నది సజ్జల ఉద్దేశంగా తెలుస్తోంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే మిగిలిన క్యాడర్ కూడా నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉందని సజ్జల జగన్ కు గట్టిగా చెబుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తే నిరసన గళం వినిపించినట్లూ ఉంటుంది, పొలిటికల్ గా ఒకింత వెసులుబాటు లభిస్తుందన్నది సజ్జల భావనగా చెబుతున్నారు.

అయితే జగన్ మాత్రం ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎన్నికలను బహిష్కరించడం వల్ల పార్టీ గ్రామస్థాయి పునాదులు మరింత బలహీనపడతాయని, రాజకీయంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి స్థానంలోనూ అభ్యర్థులను నిలబెట్టి పోరాడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో స్వయంగా సమావేశమై ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ప్రతి స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను సిద్ధం చేయాలని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన సజ్జల తాజా సమీక్షల్లో ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు, ఎన్నికల సమయంలో పార్టీ నాయకులు ఎదుర్కొనే న్యాయపరమైన, రాజకీయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక లీగల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా తెరపైకి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ పరిణామాలపై వైసీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాకుండా, పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షగా మారనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలన్న జగన్ పట్టుదల పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా? లేక క్షేత్రస్థాయిలో ఉన్న బలహీనతలు మరోసారి బయటపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
[Sajjala, Jagan, Locol Bodies, E;ections, Boycott, Contest, Differences, Telugu One]


