శైలజానాథ్ ను 'ఢీ' కొన్న రేవంత్, ఎర్రబెల్లి

 

మంత్రి శైలజానాథ్ సుదీర్గ ప్రసంగం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆయన ప్రసంగం చేస్తున్నంత సేపు కూడా తెరాస, తెదేపా తెలంగాణా నేతలు అడ్డు తగులుతూ ఆయన మాటలను, విమర్శలను త్రిప్పి కొడుతూనే ఉన్నారు. కానీ శైలజానాథ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రాష్ట్ర విభజన అంశం మొదలుకొని, విద్య, విద్యుత్, నీళ్ళు, ఉద్యోగాలు తదితర అంశాలన్నిటి గురించీ గట్టిగా తన వాదనలు వినిపించారు. సీమాంధ్రులను దోపిడీదారులనడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కానీ, తెదేపా నేత రేవంత్ రెడ్డి ఆయనకు ఘాటుగా బదులిస్తూ దోపిడీకి పాల్పడినవారందరూ సీమాంద్రులేనని వాదిస్తూ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, కృషి వెంకటేశ్వర రావు, సత్యం రామలింగ రాజు తదితరుల పేర్లను పేర్కొన్నారు. కానీ తెలంగాణా లో ఒక్క వ్యక్తి కూడా దోపిడీకి పాల్పడినట్లు దాఖలాలు లేవని ఆయన వాదించారు.

 

ఇదే రేవంత్ రెడ్డి కొన్నే నెలల క్రితం కేసీఆర్, హరీష్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఉద్యమాల పేరిట పారిశ్రామిక వేత్తలని, విద్యా, వ్యాపార సంస్థలని దోచుకొంటున్నారని ఆరోపించిన సంగతి మరిచిపోయారు. కొద్ది నెలల క్రితం తెరాస నేత రఘునందన్ రావు ఆ పార్టీ నుండి బహిష్కరింపబడినప్పుడు, హరీష్ రావు పై ఆరోపణలు చేస్తుంటే రేవంత్ రెడ్డి అదే అదునుగా తెరసాను ఏకి పారేశారు. కానీ, ఇప్పుడు తెలంగాణాలో అందరూ నీతిమంతులే, సీమాంధ్రలో అందరూ దొంగలేనని వాదించడం విడ్డూరం. ఇక తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు శైలజానాథ్ కు దీటుగా బదులిస్తూ, ఇంతగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నపుడు, అందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకా సిగ్గులేకుండా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారని ఎద్దేవా చేసారు.