శాసనసభలో ధాటిగా ఉపన్యసిస్తున్న శైలజానాథ్

 

సంక్రాంతి పండుగ శలవుల తరువాత మళ్ళీ సమావేశమయిన శాసనసభలో తెలంగాణా బిల్లుని వ్యతిరేఖిస్తూ మంత్రి శైజానాథ్ ధాటిగా ప్రసంగిస్తున్నారు. కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం తెలంగాణా యువకులను రెచ్చగొట్టి ఉద్యమం లేవదీసారని కేసీఆర్ ని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యంగా విరుద్దంగా ఉన్నటీ-బిల్లుతో బాషా ప్రయోక్తంగా ఏర్పరచిన రాష్ట్రాన్ని విడదీస్తున్నందున తాను వ్యతిరేఖిస్తున్నానని స్పష్టం చేసారు. నిజాం పాలన సమయం నాటికే తెలంగాణా అన్ని విధాల అభివృద్ధి చెందిందనే వాదనను ఆయన ఖండిస్తూ, తెలంగాణాలో ఎన్నికళాశాలలు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. మద్రాసు నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ బాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాతనే అందరి సమిష్టి కృషితో తెలంగాణాలో అభివృద్ధి జరిగిందనే సంగతిని మరుగు పరిచి, కొందరు స్వార్ధ రాజకీయ నేతలు సీమాంధ్రవాసులు తెలంగాణాను దోచుకొంటున్నారని నిందిస్తూ చులకన చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

 

తెలంగాణాలో ప్రభుత్వోద్యోగాలను సీమాంధ్ర ప్రజలు తన్నుకుపోతున్నారని అనడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అనేక వ్రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని వాటిలో ఉత్తీర్ణులయిన వారికే ప్రభుత్వోద్యోగాలు దక్కుతాయి తప్ప, ప్రభుత్వం ఎవరినీ నేరుగా నామినేషన్ పద్దతిలో నియమాకాలు చేయదని, అటువంటప్పుడు సీమాంధ్ర ప్రజలు అక్రమంగా ఉద్యోగాలు తన్నుకు పోయారని ఆరోపించడం అవివేకమని ఆయన అన్నారు. తమను సీమాంధ్రవాసులనడం కంటే తెలుగు ప్రజలని పిలిస్తేనే చాలా సంతోషిస్తామని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలను తప్పు దారి పట్టించడానికే తెలంగాణా ఏర్పడితే ఏదో చాలా లబ్ది చేకూరుతుందని రాజకీయ నాయకులు మభ్య పెడుతున్నారని, కానీ నిజానికి రాష్ట్ర విభజనవల్ల రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.