త్వరలో సచిన్ టెండూల్కర్ క్రికెట్ కి గుడ్ బై

 

భారత్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయం సృష్టించుకొన్న సచిన్ టెండూల్కర్ త్వరలో ఆ అధ్యాయం ముగించబోతున్నాడు. త్వరలో ముంబై కోల్ కత్తలో ఆడనున్న రెండు టెస్ట్ మ్యాచులతో 200 టెస్ట్ మ్యాచులు పూర్తి చేసిన తరువాత క్రికెట్ ఆట నుండి రిటర్ అవుతానని ఆయన ప్రకటించారు.

 

ఇదేవిషయం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకి తెలియజేస్తూ వ్రాసిన లేఖలో, 11ఏళ్ల వయసులో క్రికెట్ ఆట మొదలుపెట్టిన తనకు ఎప్పటికయినా దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల ఉండేదని, అది అభిమానుల, క్రికెట్ బోర్డు సభ్యుల మద్దతు, ఆశీర్వాదంతో నెరవేరిందని అందుకు వారికి సర్వదా ఋణపడి ఉంటానని తెలిపారు. తన 22 ఏళ్ల సుదీర్గమయిన కెరీర్లో, క్రికెట్ ఆటలో ఉన్న ఆనందం అంతా తనివి తీరా అనుభవించానని తెలిపారు. క్రికెట్ లేని జీవితం ఊహించుకోవడానికే చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇక ఆట నుండి తప్పుకోవలసిన సమయం ఆసన్నమయిందని తన మనసు చెపుతోందని, అందువల్లే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకొన్నానని సచిన్ తన లేఖలో తెలిపారు. ఇన్నేళ్ళుగా తనకు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ ఉన్నత శిఖరాలు జేరుకోనేందుకు తోడ్పడిన అభిమానులకు, బోర్డు సభ్యులకు మరియు కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

క్రికెట్ లేని జీవితం ఊహించుకోవడం సచిన్ టెండూల్కర్ కి ఎంత బాధ కలిగిస్తుందో, సచిన్ లేని క్రికెట్ ను ఊహించుకోనేందుకు, అభిమానులకు కూడా అంత కంటే ఎక్కువే బాధ కలిగిస్తుంది. ఆయన వంటి మేటి ఆటగాళ్ళు దేశంలో క్రికెట్ ను ఒక మతంగా మార్చగలిగితే, అందులో సచిన్ వంటి వారు క్రికెట్ దేవుళ్ళుగా కొలవబడుతున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి దేవుడి గొప్పదనం గురించి ఎవరికీ ప్రత్యకంగా వివరించనవసరం లేదు. ఆయన అభిమానులు ఇప్పుడు ఆ దేవుడు లేని దేవాలయానికి వెళ్ళడానికి అలవాటు చేసుకోక తప్పదు.