'సచిన్' కన్నా ముందే 'ద్రావిడ్'కి దక్కిన అరుదైన గౌరవం.. అదే కారణం!

 

టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. క్రికెట్ కు వన్నె తీసుకురావడమే కాకుండా, ఆట అభివృద్ధికి కృషి చేశాడంటూ ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు లండన్ లో జరిగిన కార్యక్రమంలో సచిన్ కు ఐసీసీ జ్ఞాపికను బహూకరించింది.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. దీనిని జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని తెలిపాడు. ఎంతో కాలంగా తన వెన్నంటి ఉండి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. తల్లిదండ్రులు, సోదరుడు అజిత్, భార్య అంజలి తన కెరీర్ కు వెన్నుదన్నుగా నిలిచారంటూ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా రమాకాంత్ అచ్రేకర్ లాంటి వారు కోచ్‌గా దొరకడం తన అదృష్టమని సచిన్ పేర్కొన్నాడు.

సచిన్ తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ కూడా తాజాగా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. దీంతో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ల సంఖ్య 87కి చేరింది. అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి 28 మంది క్రికెటర్లు స్థానం దక్కించుకున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే.. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న ఆరో భారత క్రికెటర్‌గా సచిన్‌ నిలిచారు. సచిన్ కంటే ముందు బిషన్‌సింగ్ బేడి, సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ క్రికెటర్‌కు లేనంత మెరుగైన రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సొంతం. అయినా ప్రతిష్ఠాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు స్థానం ఎందుకు ఆలస్యమైంది? అందులోనూ అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ తర్వాత సచిన్‌ ఈ వరుసలో నిలవడం ఏంటి? అంటే ఇందుకు ఐసీసీ నిబంధనలే కారణం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బ్యాట్స్‌మెన్‌ అయితే వన్డేలు లేదా టెస్టుల్లో కనీసం 8వేల పరుగులు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా 20 శతకాలు నమోదు చేసి ఉండాలి. సగటు 50కి పైనే ఉండాలి. బౌలర్ల విషయానికొస్తే 50 టెస్టులు, 30 వన్డేలు ఆడి కనీసం ఏదో ఒక ఫార్మాట్‌లో 200 వికెట్లు పడగొట్టి ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తవ్వాలి. సచిన్‌ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. నిబంధనల ప్రకారం వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తవ్వాల్సి ఉండటంతో.. సచిన్ కి ఈ గౌరవం దక్కడం కాస్త ఆలస్యమైంది.