గన్నులు పట్టే ఉగ్రవాదులు… వారికండగా రాళ్లు రువ్వే ఉగ్రవాదులు!

కాశ్మీర్ కి మంచి కాలం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు! సంవత్సర కాలంగా రాళ్ల వర్షం కురుస్తోంది. అందుకు సమాధానంగా భారత ఆర్మీ, జమ్మూ , కాశ్మీర్ పోలీసులు కూడా గట్టిగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా మరో ఎన్ కౌంటర్ మరోసారి రాళ్లు రువ్వే వేర్పాటవాద ఉన్మాద మూకలకి పని కల్పించింది. ఆర్మీ, పోలీసులు టార్గెట్ గా వేలాది రాళ్లు గాల్లోకి ఎగురుతున్నాయి…

 

సంవత్సరం క్రితం బుర్హాన్ వనీ అనే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ కాశ్మీర్లో ఎన్ కౌంటర్ అయ్యాడు. అప్పట్నుంచీ పాకిస్తాన్ పంపే డబ్బులు తీసుకుంటున్న కాశ్మీరీ అల్లరి మూకలు రాళ్లు రువ్వే దుర్మార్గానికి తెగబడుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతగా నియంత్రించే చర్యలు చేపట్టినా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే దేశ ద్రోహులు బుద్ది మార్చుకోవటం లేదు. తాజాగా మరో ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకే చెందిన సబ్జార్ అహ్మాద్ అనే టెర్రరిస్ట్ హతమయ్యాడు. అతను బుర్హాన్ వనీకి వారసుడుగా, హిజ్బుల్ కమాండర్ గా కొనసాగుతున్నాడు! ఇక సంవత్సరం కాలంగా ఏ బుర్హాన్ కోసమైతే రాళ్లు రువ్వారో వారంతా ఇప్పుడు అహ్మద్ కోసం అరాచకానికి తెగబడుతున్నారు. ఒకవైపు పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్ జరుగుతుండగానే మరో వైపు అల్లరి మూకలు ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వ్యవస్థల ద్వారా సమాచారం పంచుకుని రోడ్లపైకి వచ్చి దాడులు మొదలుపెట్టాయి. అందుకే, నెల తరువాత ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన రాష్ట ప్రభుత్వం పన్నెండు గంటలు కూడా గడవక ముందే వాట్ని మళ్లీ నిషేధించింది!

 

వేర్పాటువాదులు, అల్లరి మూకలు, అరాచక యువత , విద్యార్థుల వల్ల సామాన్య కాశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇంటర్నెట్ లాంటివి కూడా లేక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్మీ, పోలీసులు పూర్తి స్థాయిలో తమ సత్తా చాటి అరాచవాదుల్ని అణచివేయటం లేదు. ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం, కోర్టులు రాళ్లు రువ్వే వారిపై కాల్పులు జరపవద్దని చెప్పటం, మానవ హక్కుల సంఘాలు, మీడియా నిరంతర నిఘా భద్రతా దళాల్ని ఏం చేయలేని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ స్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం వుంది. పాకిస్తాన్ కంటే ఈ రాళ్లు రువ్వే అంతర్గత శత్రువులే కాశ్మీర్ పాలిట పెద్ద విలన్లుగా మారిపోతున్నారు…