రోడ్డు ప్రమాదాలనివారణకు సబిత చర్యలు
Published on: Thu Dec 22, 2011 8:15AM
హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాల నివారణకు వీలుగా ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్టు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులోను, రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపైనా జరుగుతున్న ప్రమాదాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డుపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేయాలని, అలాగే పది పెట్రోలింగ్ వాహనాలతో పరిస్థితిని పర్యవేక్షించాలని కూడా నిర్ణయించారు. ఇక ముందు పర్యవేక్షణకు ఉపయోగించే ఒక్కొక్క వాహనంలో ఒక ఎస్సై ఉంటారని, మొత్తం 40 మందితో పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయం వరకు లైటింగు ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఆమె వెల్లడించారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు మంగళవారంనాడు హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బుధవారంనాడు పోలీసు ఉన్నతాధికారులతో ఈ విషయమై సమావేశమయ్యారు. అదనపు డి.జి.పి. సహా సీనియర్ పోలీసు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఔటర్ రింగు రోడ్డులో జరిగిన ప్రమాదాలలో గత ఏడాది కాలంలో ఎంతో మంది మరణించడం పట్ల హోం మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఔటర్ రింగురోడ్డులో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం గురించి కూడా ఈ సమావేశంలో కొన్ని సూచనలు వచ్చాయి.


