ఏపీలో రాజకీయ పెనుమార్పులు.. వచ్చే ఏడాది కొత్త సీఎం!!

విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వద్దు అని చెప్పే మొదటి వ్యక్తిని తానేనని మాజీ ఎంపీ సబ్బంహరి అన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆలోచనా విధానం మొదటి నెలలోనే అర్థమైందని, వైసీపీ విధానాలతో తెలుగు ప్రజల ఆశలు ఆవిరయ్యాయని విమర్శించారు. అమరావతిపై వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు గుండెల్లో గుబులు రేపేలా ఉన్నాయని మండిపడ్డారు.

అమరావతి ఉద్యమంలో మహిళలు మాట్లాడే మాటలు అమోఘమని, వారి డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ఉద్యమం ప్రజలమనసులను కలచివేసింది అని, ప్రభుత్వం చర్యలను ప్రజలంతా చీదరించుకుంటున్నారని అన్నారు. విశాఖ నుండి అమరావతి వరకు పాదయాత్రగా రావాలని తాను భావించానని, కానీ కరోనా కారణంగా వాయిదా పడిందని సబ్బంహరి తెలిపారు. 

కౌన్సిల్ రద్దు చేస్తామని చెప్పి మరల వెనకడుగు వేసి కౌన్సిల్ నడుపుతున్నారని జగన్ సర్కార్ ని ఎద్దేవా చేశారు. రంగులు మార్చే పని చేస్తున్నారని విమర్శించారు. మరో నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు భరించవలసి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి స్ధానంలో జగన్మోహన్ రెడ్డి కాకుండా వేరే వ్యక్తి ఉండే అవకాశం ఉంటుందనే సమాచారం ఉందని సబ్బంహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

60 సంవత్సరాల పాటు హైదరాబాద్ లో ఇటుక ఇటుక కట్టి అభివృద్ధి చేస్తే కట్టుబట్టలతో బయటకు పంపారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆశలకు రూపకల్పన చేసిందని కొనియాడారు. కానీ ప్రభుత్వం మారడం వలన ప్రజలు రోడ్లుపైకి వచ్చారని అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే వారు ప్రభుత్వం మారడంతో నిరాశకు గురయ్యారని తెలిపారు. అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యం అవుదామని.. గత ప్రభుత్వంలో ప్రజలు కన్న కలలు సాకారం అయ్యేందుకు ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి  పోరాటం చేయాలని సబ్బంహరి పిలుపునిచ్చారు.

ఈ ప్రభుత్వం రాక్షసక్రీడలు ఆడుతుంది అని మండిపడ్డారు. 2022 లో జమిలి ఎన్నికలు వస్తాయి.. ఇదే జరిగితే మనం కలలు కన్నఅమరావతి రాజధాని సాకారం అవుతుంది అని అన్నారు. అమరావతి మార్చే పరిస్థితి లేదు.. రాష్ట్రంలో రాజకీయ పెనుమార్పులు జరుగుతాయని సబ్బంహరి వ్యాఖ్యానించారు.