టీడీపీ పై బీజేపీ కుట్ర.. నాదగ్గర పక్కా సమాచారం ఉంది..

 

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఇంతకుముందెన్నడూ లేనంత హాట్ గా తయారయ్యాయి. ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం.. మరోపక్క బీజేపీ నుండి టీడీపీ బయటకు రావడం... ఇక ఇన్ని రోజులు టీడీపీతోనే ఉన్నాడనుకున్న పవన్ ఒక్కసారిగా ఆ పార్టీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం.. దీంతో పవన్ వెనుక బీజేపీ ఉందని టీడీపీ అనడం...పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై అవిశ్వాసం తీర్మానాలు పెట్టడం.... వైసీపీ మేమే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టామని అంటే.. దానికి టీడీపీ విమర్శించడం ఇలా పార్టీలన్నీ జనాల్ని కన్య్పూజన్ లో పడేశాయి. దీంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో పడ్డారు.

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.  అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని, అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో ఆందోళన చేయిస్తోందని తేల్చి చెప్పారు. సాటి తెలుగువారికి అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఇలా చేయడం ఎంతమాత్రమూ సబబు కాదన్నారు. మోదీపై ఇది తొలి అవిశ్వాసమని, చర్చకు వస్తే అంతర్జాతీయంగా ఆయన పరువు పోతుందనే అడ్డుకుంటున్నారని అన్నారు. అంతేకాదు... వైసీపీ-జనసేనలను ఉపయోగించుకుని టీడీపీని తొక్కేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని.. ఈ విషయంలో తన వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదన్న మోదీ-షా ద్వయం కుట్ర వల్లే ఏపీకి ఇన్ని కష్టాలు వచ్చాయన్నారు.  ఇక ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పని అయిపోయినట్టేనని, ఆ పార్టీతో ఎవరు కలిసినా మటాషేనని తేల్చి చెప్పారు. మరి ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే... ఎవరి స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.