TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చచ్చు తెలివితేటలతో చావగొట్టేస్తోన్న నెటిజన్లు!

Published on: Fri Sep 23, 2016 10:35AM

 

సోషల్ మీడియా.. ఇప్పుడు ఇది తెలియని వారు ఎందరున్నారో సరిగ్గా తెలియదుగాని... ప్రపంచాన్ని మాత్రం సమూలంగా మార్చేసింది! ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్లు జనం రోజువారి జీవితంలో అత్యంత కీలకం అయిపోయాయి. ఒకవేళ ఓ పది రోజులు ఫేస్బుక్, ట్విట్టర్ లు లేకపోతే అందరూ ఏమైపోతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది! కాని, సోషల్ మీడియా క్రేజ్ కు మరో కోణం కూడా వుంది. అది అంతగా హర్షించదగింది కూడా కాదు!

 

ఎస్ జానకి అంటే ఎవరికి మాత్రం అభిమానం వుండదు చెప్పండి? మానవ రూపం దాల్చిన సంగీత సరస్వతి అంటారు ఆమెని తన అభిమానులు. అయితే, జానకి తాజాగా ఓ ప్రకటన చేశారు. మలయాళ సినిమా కోసం తాను పాడుతున్న ఓ పాటే తనకు చివరి పాట అని ఆమె చెప్పారు! అంటే.. ఇక మీదట తాను రికార్డింగ్ లకు హాజరుకానని ఆమె ఉద్దేశ్యం! ఎస్ జానకి లాంటి లెజెండ్రీ సింగర్ ఇక మీద పాటలు పాడరు అంటేనే ఎంతో బాధాకరమైన విషయం. అయినా కూడా ఆమె వయస్సు దృష్ట్యా ఆమె నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని, అసలే ఇక జానకి గానామృతం వుండదని బాధపడుతున్న ఆమె అభిమానులకి సోషల్ మీడియా వెబ్ సైట్లు మరింత షాక్ నిచ్చాయి. కొందరు నెటిజన్స్ అత్యుత్సాహంతో జానకి ఇక మీద పాటలు పాడనని అంటే ఆమె చనిపోయినట్టు భావించారు! వచ్చిన న్యూస్ మొత్తం కూడా చదివి, విని, కన్ ఫర్మ్ చేసుకునే అలవాటు లేని ఇలాంటి బద్ధకస్తులు అప్పుడప్పుడే ఇదే తప్పు చేస్తుంటారు. చాలా సార్లు సోషల్ మీడియాలో తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లు తప్పుడు సమాచారాన్నే సర్క్యూలేట్ చేసేస్తుంటారు! జానకమ్మ విషయంలో కూడా అదే జరిగింది.. 

 

జానకి ఇక మీద పాటలు పాడరని ప్రచారం కావాల్సింది కాస్తా ఆమె మరణించారని తప్పుడుగా వార్త బయలుదేరింది. గతంలో ఇలాగే మాదురీ దీక్షిత్, అమితాబ్ లాంటి వారు కూడా బలయ్యారు. వాళ్ల వాళ్ల అభిమానులు ఈ చచ్చు చావు వార్తలు విని హడలిపోయారు! అయినా చేతిలో కంప్యూటరో, స్మార్ట్ ఫోనో వుందో కాబట్టి సోషల్ మీడియాలో ఏదంటే అది రాసేయటం, కాదంటే షేర్ చేయటం కాకుండా సామాన్య జనం కూడా ఇక మీదట జాగ్రత్త పడాలి. ఎందుకంటే, ఫేస్బుక్ , ట్విట్టర్ లాంటి వాటి వల్ల ఇప్పుడు ప్రతీ వ్యక్తి జర్నలిస్టే అయిపోయాడు. మనం ఏం పోస్ట్ చేసినా అది గంటల్లో గందరగోళం సృష్టించేసే అవకాశం వుంది! అలాంటి ఘటనలే ఈ మధ్య కొన్ని ప్రాంతాల్లో మత కలహాలుగా మారాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ సంయమనం పాటించాలి. సోషల్ రెస్పాన్సిబులిటి లాగే సోషల్ మీడియా రెస్పాన్స్ బులిటి కూడా అలవర్చుకోవాలి...