యుద్ధానికి వందరోజులు మిగిలింది విషాదమే ...
Published on: Fri Jun 3, 2022 11:11PM
ఏ రెండు దేశాల మధ్య జరిగినా యుద్ధం మిగిల్చేది విషాదం,విద్వంసమే... వందరోజులకు చేరుకున్న ‘రష్యా - ఉక్రెయిన్’ యుద్ధం ఇందుకు మినహాయింపు కాదు. ఈ వందరోజుల్లో ఎన్నెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో... ఎన్నెన్ని సంసారాలు చితికిపోయాయో లెక్కలేదు. ఎంత మంది చిన్నారులు అనాధలయ్యారో, ఎందరు తల్లులు కానన్ బిడ్డలను కోల్పోయి కడుపు కోతను అనుభవిస్తున్నారో .. తెలియదు. మనిషితనం మరిచి పోయిన యుద్ద పిపాస వందల వేల మంది పాలిట మరణ శాసనమైంది.
పొరుగు దేశం ఉక్రెయిన్’పై రష్యా ఆధిపత్య దురహంకారాన్ని ప్రదర్శిస్తోందా, అత్మరక్షణ కోసమే రష్యా ఉక్రెయిన్ పై బాంబుల వాన కురిపిస్తోందా, ఉక్రెయిన్’ అగ్రరాజ్యం అమెరికా సాగిస్తున్నతెరచాటుయుద్ధానికి బలైపోతోందా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ దురహంకార, దుర్మార్గ దండయాత్రకు బలైపోతోంది మాత్రం, అమాయక ప్రజలు, సైనికులే .
యుద్ధం వందో రోజుకు చేరుకుంది. అయినా ఇంకా, ఉక్రెయిన్’ పై బాంబుల దాడి కొనసాగుతూనే వుంది.. భవనాలు పేకమేడల్లా కూలుపోతున్నాయి. నగరాలు, పట్టణాలు ఎక్కడంటే అక్కడ వీదుల్లో శవాలే పలకరిస్తున్నాయి. బతికుంటే చాలని సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఇంత విధ్వసం జరుగుతున్నా అంతర్జాతీయ సమాజం గుడ్లప్పగించి చూడడమే కానీ, ఏమీ చేయలేక పోతోంది. రష్యా మీద ఆంక్షలు విధించినా, అవేవి పనిచేయడం లేదు. మరో వంక ‘రష్యా - ఉక్రెయిన్’ యుద్ధం మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, అదే విధంగా మన దేశం సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, యుద్ధం ప్రభావం రోజురోజుకు బలపడుతోంది.
అదలా ఉంటే యుద్ధం మిగిల్చిన విషాదం ఎంతన్న దానికి లెక్కలు లేవు. యుద్ధంలో ఎంత మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నది ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. కానీ, కనీసం 10వేల మంది తమ దేశ పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రోజుకు 60 నుంచి 100 మంది ఉక్రెయిన్ సైనికులు అమరులవుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, ఒక్క మేరియుపోల్‌లోనే 21వేల మందికి పైగా పౌరులు మృతిచెందినట్లు అక్కడి అధికారులు చెప్పడం గమనార్హం. నిజానికి, అక్కడి పరిస్థితికి సంబంధించి అందుతున్న అరకొర సమాచారం ఆధారంగా చూసినా, మృతుల సంఖ్య వేలు దాటి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా దాడిని ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్’ లోనే కాదు, తగ్గేదేలే అన్నతీరున దాడి కొనసాగిస్తున్న రష్యా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగిందని అంటున్నారు. అయితే ఉక్రెయిన్’లోలానే రష్యాలో ఎంత ప్రాణ నష్టం జరిగిందన్నది కూడా ప్రపంచానికి తెలియరాలేదు. 30వేల మందికి పైగా క్రెమ్లిన్ సైనికులు మరణించి ఉంటారని జెలెన్‌స్కీ తెలిపారు.కానీ రష్యా మాత్రం ఇప్పటివరకు 1351 మంది జవాన్లు మృతిచెందారని మార్చి 25న ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఏమి జరిగింది ఎంతమంది చనిపోయారు అనేదానికి సంబంధించి అధికార, అనధికార సమాచారం ఏదీ అందుబాటులో లేదు.
ఇక ఉక్రెయిన్’లో జరిగిన ఆస్థి నష్టం విషయానికి వస్తే రష్యా సేనల బాంబు దాడుల కారణంగా దాదాపు 38వేల నివాస భవనాలు నేలమట్టమైనట్లు ఉక్రెయిన్ పార్లమెంటరీ కమిషన్ వెల్లడించింది. దీంతో 2.20లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని తెలిపింది.దాదాపు 1900 విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి. ఇందులో 180 నామరూపాల్లేకుండాపోయాయి. 50 రైలు వంతెనలు, 500 ఫ్యాక్టరీలు, 500 ఆసుపత్రులు నాశనమయ్యాయి.మరోవంక, ఈ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు 68లక్షల మంది ఉక్రెయిన్‌ను వీడి ఇతర దేశాలకు వలస వెళ్లినట్లు ఐరాస శరణార్థలు సంస్థ అంచనా వేసింది. అయితే ఆ తర్వాత కీవ్ సహా కొన్ని ప్రాంతాల్లో యుద్ధ పరిస్థితులు సద్దుమణగడంతో 22లక్షల మంది తిరిగి స్వదేశానికి వచ్చారని తెలుస్తోంది. ఆలాగే ఈ వందరోజుల యుద్ధంలో 20శాతం ఉక్రెయిన్ భూభాగం రష్యా ఆక్రమించుకుందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడే ప్రకటించారు.
యుద్ధాన్ని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. ఇప్పటివరకు ఆ దేశంపై 5వేల ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ దేశంపైనా ఇన్ని ఆంక్షలు అమల్లో లేవు. దాదాపు 300 బిలియన్ డాలర్ల రష్యా బంగారం, విదేశీ మారక నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. ఫలితంగా రష్యాలో 1000కి పైగా కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేయడం లేదా తగ్గించడం చేశాయి.రష్యా దాడులతో ఉక్రెయిన్ ఆర్థికంగా భారీగా నష్టపోయింది. ఇప్పటివరకు యుద్ధం కారణంగా జీడీపీలో 35శాతం కోల్పోయింది. మొత్తం నష్టం 600 బిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇలా ఏ కోణం నుంచి చూసినా, యుద్ధం అనర్దాన్నే మిగిల్చింది. అయినా, ఫిబ్రవరి 24 సైనిక చర్యగా మొదలైన యుద్ధం, ముగింపు ఎప్పుడో, ఇంకెంత దూరంలో వుందో తెలియకుండా కొనసాగుతూనే వుంది.


