రష్యా డాల్ఫిన్ ఆర్మీ!
Published on: Wed Jun 29, 2022 1:04PM
సైన్యంలోకి యువతను అనేక పరీక్షలు పెట్టి తీసుకోవడం మామూలే. అనేక రకాల శిక్షణలు ఇచ్చి అనేక విభాగాల్లో సైన్యాన్ని సిద్ధం చేయడం ఏ దేశానికయినా పరిపాటి. కానీ డాల్ఫిన్‌లను కూడా యుద్ధానికి సిద్ధం చేయడం మాత్రం రష్యాకే చెల్లింది! అవును. ఉక్రెయిన్‌తో తలపడిన యుద్ధంలో నేల మీంచే కాకుండా సముద్రం గర్భం నుంచి కూడా దాడులు చేయ డానికి రష్యా కొత్త వ్యూహ రచన చేసింది.
దీన్ని ఉక్రెయిన్ కనీవినీ ఎరుగదు. నల్లసముద్రంలో తన నావికా స్థావ రాన్ని సురక్షితం చేసుకోవడానికి కోస్టల్ ఆర్మీలా డాల్ఫిన్ ఆర్మీని తయారుచేసింది. కుక్కలకి శిక్షణ నీయ వచ్చు. ఇది ఎప్పటినుంచో పోలీస్ శాఖ వారు అమలుచేస్తున్న పద్ధతి. డాగ్ స్క్వాడ్ అనేది వుంది. రహస్యా ల్ని ఛేదించడానికి, దొంగల్ని, హంతకులను పట్టుకోవడానికి కుక్కలను రంగంలోకి దింపుతారు. అవి వాస నను పట్టి తిన్నగా హంతకుడిని పట్టిస్తాయి. దీనికి ప్రత్యేక శిక్షణా వుంటుంది. అదో ప్రత్యేక విభాగం.
శిక్షణ ఇవ్వడానికి మరి డాల్ఫిన్స్‌ని ఎలా మచ్చికచేసుకున్నారో! డాల్ఫిన్స్‌తో సరదాగా ఆడవచ్చని చాలా సందర్భాల్లో విదేశాల్లో సముద్ర తీరాల్లో తీసిన చిత్రాలు, వీడియోలు తెలియజేశాయి. అది ఓ పది పది హేను నిమిషాల ఆట వరకే. కానీ యుద్ధానికి సన్నద్ధం చేయడం మామూలు విషయం కాదు. నల్ల సము ద్రంలో నవాస్తా పోల్ అనే చోట రెండు డాల్ఫిన్ శిక్షణా కేంద్రాలు వున్నట్టు అమెరికా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించింది.
డాల్ఫిన్‌కి సముద్రం అడుగున ఏవయినా వింత వస్తువులు గుర్తించే ప్రత్యేకత వుంది. అంటే సైనిక దాడు ల్లో భాగంగా నీటి అడుగున శతృవువులు ఏమన్నా అమర్చారనేది తెలుసుకోవడానికి డాల్ఫిన్ ఎంతో సహ కరిస్తుంది. అందువల్ల వాటిని రష్యా ప్రత్యేక దళంగా భావించి వినియోగించిందని తేలింది. అయితే ఈ తరహా డాల్పిన్ సైన్యాన్ని పూర్వం అంటే 1950ల్లోనే అమెరికా వుపయోగించింది. మరి మెల్లగా ఈ జల జీవాల సైన్యానికి సముద్ర తీరం వున్న దేశాలు కూడా ఆసక్తి చూపుతాయనే అనుకోవాలి.


