TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉక్రెయిన్ అణు రియాక్టర్‌పై ర‌ష్యా అటాక్‌.. మాన‌వాళికి ముప్పు త‌ప్ప‌దా?

Published on: Fri Mar 4, 2022 10:39AM

ర‌ష్యా బ‌రితెగిస్తోంది. బ‌లుపుతో చెల‌రేగిపోతోంది. యుద్ధం ఆరంభ‌మై 10 రోజులు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క న‌గ‌రం కూడా స్వాధీనం కాక‌పోవ‌డంతో అస‌హ‌నంతో ర‌గిలిపోతోంది. యుద్ధంలో వెయ్యికి పైగా ర‌ష్య‌న్ సైనికులు చ‌నిపోవ‌డం.. భారీగా ఆయుధాల‌ను కోల్పోవ‌డంతో.. పిచ్చెక్కిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోంది. ఉక్రెయిన్‌ను వీలైనంత తొంద‌ర‌గా లొంగదీసుకోవడానికి రష్యా.. అణు రియాక్ట‌ర్ల‌ను టార్గెట్ చేసింది. యూర‌ప్‌లోకే అతిపెద్ద అణు రియాక్టర్‌ అయిన జాపోరిషియాపై రష్యా దళాలు దాడి చేశాయి. యుద్ధట్యాంకులతో భారీగా బాంబ్‌ షెల్లింగ్ చేశాయి. బాంబుల దాడికి అణు రియాక్టర్‌ సమీపంలో మంటలు చెలరేగాయి. 

ఆ ప్రాంతంలో మొత్తం ఆరు రియాక్టర్లు ఉండ‌గా.. అందులో ఒక దానిని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. దాడికి గురైన రియాక్టర్‌ ప్రస్తుతం మ‌ర‌మ్మ‌త్తులో ఉంది. కానీ, దానిలో అణు ఇంధనం ఉండటంతో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. 

ఉక్రెయిన్‌కు ఇంధన, విద్యుత్తు సరఫరాలను తొక్కిపెట్టేందుకు రష్యా దళాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఆదివారం ఓ గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చివేశాయి. తాజాగా జాపోరిషియా అణు విద్యుత్తు కేంద్రంపై షెల్లింగ్‌ చేశాయి. 

తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ ప్రాంతంలో రష్యా దళాల కదలికలను ఆపేయాలని.. వెంటనే అగ్నిమాపక దళాలను ప్రమాదస్థలికి అనుమతించాలని కోరినట్టు వైట్‌హౌజ్ ప్రకటించింది.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని ట్వీట్‌ చేశారు. యురోపియ‌న్ యూనియ‌న్‌ ఇప్పటికైనా యాక్టివ్‌ కావాలని విజ్ఞప్తి చేశారు.  ‘‘రష్యా యుద్ధ ట్యాంకులు నేరుగా రియాక్టర్లపై దాడి చేశాయి. అది యూర‌ప్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్తు కేంద్రం. ఒక వేళ ఏమైనా పేలుడు జరిగితే.. యూర‌ప్‌కు అదే ముగింపు అవుతుంది. యూర‌ప్‌ దేశాలు చురుగ్గా స్పందిస్తేనే రష్యా దళాలను అపగలం’’ అని ఆయన ఆ వీడియోలో పిలుపిచ్చారు.