ఆర్టీసీ ఛార్జీలు పెంపు.. జగనన్న బాదుడే బాదుడు..
Published on: Wed Apr 13, 2022 3:46PM
ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచేశారు. బిల్లులతో పాటు కోతలతో వాతలు పెడుతున్నారు. ఒక్క కరెంట్ అనే కాదు.. పెట్రోల్, డీజిల్, ఇసుక, ఆయిల్, పప్పులు, కూరగాయలు.. ఇలా జగనన్న పాలనలో సకలం చుక్కలను తాకుతున్నాయి. ఇవి చాలవన్నట్టు.. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేసింది వైసీపీ ప్రభుత్వం. ధరలు, ఛార్జీల బాదుడే బాదుడుతో.. సామాన్యుడి నడ్డి విరగ్గొడుతోంది.
ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ధరలను పెంచుతున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ‘‘పల్లె వెలుగు బస్సులో రూ. 2 పెంచుతున్నాం. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నాం. ఇకపై పల్లె వెలుగు బస్సులో కనిష్ఠ ఛార్జి రూ.10గా ఉంటుంది. ఇది పూర్తిగా డీజిల్‌పై విధించే సెస్ మాత్రమే.. టికెట్ రివిజన్ కాదు. డీజిల్ సెస్ వల్ల ప్రజలపై ఏడాదికి రూ.720 కోట్ల భారం పడుతుంది. రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గింది. ప్రస్తుతం నష్టాలను భరించలేని పరిస్థితికి ఆర్టీసీ వచ్చింది. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తాం. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటాం.’’ అని ఆర్టీసీ ఎండీ చెప్పారు.
ధరల పెరుగుదలపై ఇప్పటికే టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తోంది. బాదుడే బాదుడు అంటూ.. టీడీపీ హయాంలో ధరలను, వైసీపీ పాలనతో పెరిగిన ధరలను పోలుస్తూ.. ఇంటింటికీ కరపత్రాలు పంచుతోంది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుస్తూ.. ధరల పెరుగుదలపై వారిలో అవగాహన కల్పిస్తున్నారు. కరెంట్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతల అవస్థలపై వారితో చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆర్టీసీ ఛార్జీలు సైతం ప్రభుత్వం పెంచేయడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టే అంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఒక జేబులో 100 రూపాయలు పెట్టి.. ధరల పెంపుతో ఇంకో జేబు నుంచి 200 లాగేస్తున్నారని జనం మండిపడుతున్నారు.


