TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉద్యోగుల మధ్య భలే ఐకమత్యం

Published on: Wed May 6, 2015 10:41PM



ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో రెండు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఎంతలా తిట్టుకున్నారో, ఒకరి మీద మరొకరు ఎంతలా కయ్యానికి కాలు దువ్వుకున్నారో అందరికీ తెలిసిందే. ఇరువర్గాల వారు ప్రదర్శించిన ఆవేశ కావేషాలు చూసి బాబోయ్... భవిష్యత్తులో వీరు ఎప్పటికీ కలవలేరు... ఒక మాట మీద నిలబడలేదని అందరికీ అనిపించింది. ఉద్యోగుల మధ్య ఇంతలా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, మానసికంగా ఇద్దరూ విడిపోయిన  పరిస్థితుల్లో ఇక రాష్ట్రం విడిపోవడమే  మంచిదని అనిపించింది. అందరికీ అనిపించిందే జరిగింది. రాష్ట్రం విడిపోయింది. విడిపోయి కలిసుందామని ఏ మహానుభావుడి నోటి వెంట మొదటిసారి వచ్చిందోగానీ, ఆ మాట  రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ప్రజల విషయంలో ఎలా వున్నా ఉద్యోగుల విషయంలో మాత్రం బాగా వర్కవుట్ అవుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు విడిపోయిన తర్వాత భలే కలసి వుంటున్నారు. ఎన్నటికీ కలవటం అసాధ్యం అనుకున్నవాళ్ళే ఇప్పుడు కలసి మెలసి వుంటున్నారు.

ఇంతకీ రెండు రాష్ట్రాల ఉద్యోగులు కలసి మెలసి వుంటోంది ఏ విషయంలో అనుకుంటున్నారు... సమ్మెలు చేసే విషయంలో,  ప్రభుత్వాల ముందు డిమాండ్లు పెట్టి వాటిని సాధించుకునే విషయంలో. రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ విభాగం ఉద్యోగులైనా ఒక డిమాండ్ పెట్టారంటే, రెండో రాష్ట్రంలోని అదే విభాగం ఉద్యోగులు సేమ్ డిమాండ్ తమ ప్రభుత్వం ముందు వుంచుతున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏదైనా ఉపయోగపడే పనిచేస్తే, రెండో రాష్ట్రంలోని ఉద్యోగులు తమకు కూడా ఆ ప్రయోజనం కలిగించాల్సిందేనని తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా వున్న తెలంగాణ ప్రభుత్వం మొన్నామధ్య ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే, ఆర్థికంగా ఆరిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు  తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. లేటెస్ట్‌గా ఆర్టీసీ సమ్మె కూడా కలసి మెలసి  చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉద్యోగులు ఏ డిమాండ్ అయినా కలసికట్టుగా చేస్తున్నారు. మరి  రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగుల మధ్య బాగా బలపడిన ఈ ‘ఐకమత్యం’ రెండు రాష్ట్రాలను ఎక్కడకి తీసుకెళ్తుందో చూడాలి.