సమైక్యాంధ్ర ఉద్యమంలో చీలికలు మొదలయ్యాయా

 

 సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ.యన్.జీ.ఓ.లు నిరవధిక సమ్మెకు దిగడంతో సీమాంధ్ర ప్రాంతం దాదాపు స్తంభించిపోయింది. గత రెండు వారాలుగా సీమాంధ్ర ప్రాంతంలో వేలాది ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ప్రభావం బాగా కనబడుతోంది. అయినప్పటికీ కేంద్రం మాత్రం దిగివస్తున్న సూచనలు కనబడకపోవడంతో క్రమంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వోద్యోగులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రోజులు కొనసాగుతున్నకొద్దీ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులలో మునుపటి ఉత్సాహం కూడా క్రమంగా తగ్గుతోంది. ఇక నెల జీతాల మీదనే ఆధారపడిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది.

 

బహుశః ఆ కారణంగానే విజయవాడ, కడప మరియు నెల్లూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘాల నేతలు త్వరలో అంటోనీ కమిటీని కలిసేందుకు నిశ్చయించుకొన్నారు. అయితే వారు కమిటీకి సమైక్యాంధ్ర కోరుతూ వినతి పత్రం ఈయడంతో బాటు, ఆర్టీసీపై ఉన్న రూ.5000 కోట్ల రుణభారం ప్రభుత్వం స్వీకరించాలని, అదేవిధంగా సంస్థ పూర్తిగా కోలుకోవడానికి అదనంగా మరో రెండువేల కోట్లు సహాయం కూడా చేయాలని వారు కోరనున్నారు.

 

తమ సంస్థ తీవ్ర నష్టాలలో కూరుకుపోయి ఉందని తెలిసి కూడా ఆర్టీసీ నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో దిగి, ఇప్పుడు తమ సంస్థను రక్షించాలంటూ అంటోనీ కమిటీని కోరబోవడం హాస్యాస్పదం. సంస్థ మనుగడపైనే వేలాది కార్మికుల జీవితాలు ఆధార పడిఉన్నాయనేది ఎవరూ కాదనలేని నిజం. అటువంటప్పుడు సంస్థను కాపాడుకోవలసిన ఉద్యోగులు నిరవదిక సమ్మెచేసి సంస్థ మూతబడే స్థితికి తీసుకువస్తే మొట్ట మొదట నష్ట బోయేది వారేననే గ్రహింపు లేకపోవడం విచిత్రం. ఇదే సూత్రం మిగిలిన సంస్థలకు కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు.

 

ఇక, సమైక్యాంధ్ర కోరుతూ సమ్మెకు దిగిన నేతలు ఇప్పుడు తమ ప్రధాన డిమాండు నేరవేర్చమని కోరకుండా ఆర్టీసిని ఆదుకోమని కోరడం విశేషం. బహుశః త్వరలోనే మిగిలిన ప్రభుత్వోద్యోగులు కూడా క్రమంగా తమ బెట్టు సడలించి ఇటువంటి కోరికల చిట్టాలతో ఆంటోనీ కమిటీ ముందు బారులు తీరినా ఆశ్చర్యం లేదు.

 

బహుశః కేంద్ర ప్రభుత్వం కూడా వారిలో ఈ మార్పు కోసమే బిగుసుకొని కూర్చొని ఉన్నట్లు కనబడుతోంది. ఒకసారి ఉద్యమంలో చీలికలు వస్తే, ఇక రాజకీయ పార్టీలు కూడా వెంటనే వెనక్కి తగ్గడం ఖాయం. ఆ తరువాత విభజన ప్రక్రియ ఊపందుకోవచ్చును.