సజ్జనార్ అవినీతి.. ఆర్టీసీ ఉద్యోగుల నిరసన.. విషయమేంటంటే..?
Published on: Wed Mar 12, 2025 11:41AM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మంగళవారం (మార్చి 11) నిరసనకు దిగారు. అయితే వారి నిరసన తమ వేతనాలు పెంచాలనో, సమస్యల పరిష్కారం కోసమో కాకుండా సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ కు వ్యతిరేకంగా. సజ్జనార్ అవినీతికి పాల్పడ్డుతున్నారంటూ, ఆయన అవినీతి కారణంగా సంస్థకు భారీ నష్టం వాటిల్లుతోందంటూ వారు నిరసనకు దిగారు. అంతే కాకుండా సజ్జనార్ అవినీతికి సాక్ష్యాలున్నాయంటూ ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డిలకు తొమ్మిది పేజీల లేఖ రాశారు.
సజ్జనార్ అవినీతి అంటూ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పోలీసు అధికారిగా క్రిమినల్స్ కు సింహ స్వప్నంగా నిలిచిన సజ్జనార్ ఆయన కెరీర్ మొత్తంలో అవినీతి మరక అంటని అధికారిగా పేరు పొందారు. పోలీసు వర్గాల్లోనే కాదు, సామాన్య జనంలో కూడా ఆయన నిజాయతీపరుడైన అధికారిగా గుర్తింపు పొందారు.
మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాల విషయంలో ఆయన నిందితులపై కఠినంగా వ్యవహరిస్తారని పేరు. గతంలో వరంగల్ లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసు, హైదరాబాద్ లో వెలుగు చూసిన దిశ హత్యాచారం కేసుల్లో అతి తక్కువ సమయంలోనే నిందితులను ఎన్ కౌంటర్ చేసిన సజ్జనార్ పట్ట తెలుగు ప్రజలకు గౌరవం, అభిమానం ఉన్నాయి. అటువంటి అధికారి అవినీతికి పాల్పడ్డారంటూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు నిరసనకు దిగడం పట్ల సర్వత్రా దిగ్భ్రమాశ్చర్యాలు వ్యక్తమయ్యాయి.
ఇంతకీ విషయమేంటంటే.. ఆర్టీసీ లో డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వారిలో కొందరు సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఫిర్యాదులపై విచారణ జరిపిన సజ్జనార్ ఆ ఆరోపణలు నిజమేనని తేలడంతో దాదాపు 400 మందిని విధులలోనుంచి తొలగించారు. ఇలా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఉద్యోగాలు కోల్పోయిన వారే మంగళవారం (మార్చి 12) సజ్జనార్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆందోళనకు దిగారని టీజీ ఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.


