ఆర్టీసీ క్రాస్‌రోడ్డు బావర్చి బిర్యాని బంద్

 

హైదరాబాద్‌ మహానగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో బావర్చి హోటల్‌ తెలియని వారు ఉండరు. బిర్యానీ తయారీలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ హోటల్ ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఈరోజు మధ్యాహ్నం సీజ్‌ చేశారు. హోటల్‌ నిర్వాహకులు వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడంలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ హోటల్‌ను సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత నేతృత్వంలో అధికారులు, సిబ్బంది కలిసి హోటల్‌ను మూసివేశారు. అనంతరం హేమలత మాట్లాడుతూ.. గత కొంత కాలం నుంచి హోటల్‌ నిర్వాహకులకు తడి, పొడి చెత్తను వేరు చేయాలని, ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని సూచించినప్పటికీ వారు ఇప్పటికీ స్పందించలేదన్నారు. జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా హోటళ్ల నిర్వాహకులు వ్యర్థపదార్థాలను మ్యాన్‌ హోల్‌లోకి వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జలమండలి అధికారుల సూచన మేరకు 2016 నుంచి నోటీసులు ఇస్తున్నా వారు పట్టనట్టు ఉండటంతో ఈ రోజు సీజ్‌ చేసినట్టు ఆమె వెల్లడించారు. రుచి ఎంత ముఖ్యమో శుభ్రత కూడా అంతే ముఖ్యం లేదా ఇలానే మూతపడతాయి.