డ్రైవర్ గుట్కా వేసుకోబోయాడు.. బస్సు లోయలో పడింది

 

తమ చేతిలో ఉంది కేవలం స్టీరింగ్ కాదు, ఎందరో ప్రయాణికుల ప్రాణాలని తెలుసుకోలేని కొందరు బస్సు డ్రైవర్లు.. నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారన్న సోయ కూడా లేకుండా.. డ్రైవర్ స్టీరింగ్ వదిలేసి గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించాడు. గుట్కా అతని నోట్లోకి పడటానికి ముందే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి వెళ్తోంది. బస్సు టీవీనగర్ సమీపంలోని మానేరు వంతెన దాటుతున్న క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి వంతెన పక్కనున్న గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనంలో క్షతగాత్రులను కాటారం, మహదేవ్‌పుర్, మంథని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.