అరెస్సెస్ ప్యాంట్లు, రబ్రీదేవి చలవే... లాలూ
Published on: Tue Mar 15, 2016 12:16PM
.jpg)
ఇదివరకు ప్రతిపక్షాలు విమర్శించి ఊరుకునేవి. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు అలా కాదు. ఎదుటివారు తప్పు చేస్తే విమర్శించడమే కాదు, ఒక వేళ ఆ తప్పుని సరిదిద్దుకుంటే... తమకి భయపడే సదరు మార్పు జరిగిందని గొప్పలు చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. మొన్నటికి మొన్న ప్రావిడెంట్ ఫండ్ మీద పన్నుని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అది తనకి భయపడే అని రాహుల్‌బాబు చెప్పుకొచ్చారు.
ఈ వార్తని ఒకటికి రెండుసార్లు చదివారో ఏమో, లాలూ ప్రసాద్ కూడా అదే బాట పట్టారు. ఆరెస్సెస్ ఇక నుంచీ నిక్కర్లను కాకుండా, ప్యాంట్లను ధరించాలన్న నిర్ణయం తీసుకోవడం రబ్రీదేవి చేసిన సూచన మేరకే అనేశారు. భాజపాకు అనుబంధ సంస్థ అయిన ఆరెస్సెస్ తన 90 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కాదని, ఈ కొత్త దుస్తులకు స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే! రబ్రీ దేవి ఆ మధ్య ఆరెస్సెస్‌ను విమర్శిస్తూ, ‘ఆ సంస్థలోని పెద్దపెద్దవాళ్లే సిగ్గులేకుండా నిక్కర్లు వేసుకుని జనం మధ్యలోకి వస్తుంటారని’ అన్నారు. రబ్రీ వాదనలో చాలా అద్భుతమైన తర్కం ఉందనీ, ఆ తర్కానికి లొంగి ఆరెస్సెస్ తన పంథాని మార్చుకోక తప్పలేదని లాలూ చెప్పుకొచ్చారు. ఇంకా లాలూ నోటి నుంచి ఏమేం వినాల్సి వస్తుందో!


