TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2000 నోటుతో అసలుకే మోసం!

Published on: Sat Nov 12, 2016 2:06PM

 

మోదీవారు పెద్దనోట్లని రద్దుచేసి నాలుగు రోజులు పూర్తవుతోంది. బడాబాబుల సంగతేమో కానీ, సామాన్యులు మాత్రం అల్లల్లాడిపోతున్నారు. నిర్ణయం ఎంత గొప్పదైనా అందులో సన్నద్ధత లేదనీ, యూపీ ఎన్నికలలో విజయం కోసమే తొందరపాటు నిర్ణయం తీసుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. పాత నోట్ల మార్పిడి సంగతేమో కానీ కొత్తగా విడుదల అయిన రెండువేల రూపాయల నోటు కూడా ‘వందల’ కొద్దీ కష్టాలను మిగులుస్తోంది. కొత్తగా ఐదువందల నోట్లు కూడా విడుదల అయినప్పటికీ పని తొందరగా జరిగిపోతుందనో ఏమో బ్యాంకులన్నీ రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నాయి. ఫలితం! నిన్నటి వరకూ చెల్లని నోట్లతో తంటాలు పడ్డ జనం ఇప్పుడు చిల్లర రాని నోట్లతో రోడ్ల మీద పడుతున్నారు.

 

అసలే ఎవరి చేతుల్లోనూ డబ్బులాడని సమయంలో రెండు వేల నోట్ల రూపాయలను ఎవరు తీసుకుంటారు? అన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చినట్లు లేదు. వీలైనంత తొందరగా పాత డబ్బుని మార్పిడి చేసేందుకు విచ్చలవిడిగా రెండువేల నోట్ల రూపాయలని విడుదల చేసేసేంది. కానీ ఇలాంటి పెద్ద నోట్లు విస్తృతంగా చెలామణీ కావడం మొదలుపెడితే మళ్లీ అవినీతికీ, ధరల పెరుగుదలకీ ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నది కొందరి ఆరోపణ.

 

ఇప్పటికే 500, 1000గా ఉన్న ఓటు రేటు త్వరలో జరగబోయే ఎన్నికలలో 2,000కి చేరుకుంటుదని ఇప్పుడే అంచనా వేస్తున్నారు. ఇక నుంచి లంచావతారాల మినిమం ఛార్జీ 2000 కావచ్చునని భయపడుతున్నారు. నల్లధనంగా మార్చుకునేందుకు 2000 అనువుగా ఉంటుందని బడాబాబులు సంబరపడుతున్నారు. ఇక పెద్ద నోట్ల చెలామణీతో ద్రవ్యోల్బణమూ పెరిగే అవకాశం లేకపోలేదు. అందుకే చంద్రబాబు కూడా 2000 నోటు విడుదల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

 

ఏదేమైనా విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితెస్తానన్న మోదీ ప్రభుత్వం దేశంలోని నల్లధనం మీదే ఎక్కువ దృష్టి సారించినట్లుంది. ఆ దశలో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అనే నిర్ణయం మొదట్లో ప్రశంసలు కురిపించినా, నిదానంగా విమర్శలకు తావిస్తోంది. ఈసారి మోదీ తన దేశ ప్రజల మీదే సర్జికల్‌ దాడి చేశారంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. బడాబాబులను ఇరికించే ప్రయత్నంలో సామాన్యుల పాట్లని ప్రభుత్వం గమనించలేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. కానీ సామాన్యుల నిట్టూర్పులకి విలువేముంటుంది!